Aug 13,2021 06:25

     రింగంటి శ్రీనివాసాచార్యులు అలియాస్‌ మధు మహబూబ్‌ నగర్‌ జిల్లా రంగాపురం గ్రామంలో బ్రాహ్మణ పండిత కుటుంబంలో పుట్టినప్పటికీ పేదరికంతోనే లా చదువును పూర్తిచేశారు. కాలేజీ లోనే మార్క్సిస్టు భావాలకు, ప్రగతిశీల ఆలోచనలు కలిగిన విద్యార్థి ఉద్యమాలకు ఆకర్షితులయ్యారు. మార్క్సిజాన్ని తన సైద్ధాంతిక ప్రాపంచిక దృక్పథంగా మలుచుకుని సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తిని పెంచుకున్నారు. కల్వకుర్తి లో 'యువజన సాహితీ' సంస్థతో ప్రారంభించి, 'ప్రభాత గీతి' పత్రికకు సంపాదకత్వం వహించి, 1964లో 'గడ్డిపూలు' కథల సంపుటిని వెలువరించి...1967 నాటి నక్సల్బరీ విప్లవ కెరటం యువతరాన్ని కుదిపేసిన ఫలితంగా మధు విప్లవమే వృత్తిగా తన జీవితాన్ని ప్రారంభించారు.
తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య నాయకత్వంలో ఏర్పడిన విప్లవకారుల కమిటీలో మధు హైదరాబాద్‌ సిటీ కార్యకర్తగా చేస్తూ... ఆ క్రమంలో కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాదు నగరంలో విద్యార్థి సంబంధాలను, సాహితీ సంబంధాలను సంఘటిత పరచి విద్యార్థి సంఘాన్ని, నవోదయ సాహితీ సాంస్కృతిక సంస్థను ఏర్పరచటంలో, 'జీవనాడి-యువ భావ సంచలనం-పత్రికను తీసుకురావడంలో మధు ముఖ్య భూమికను పోషించారు.
      ఎమర్జెన్సీ కాలంలో 'జీవనాడి' ఆగిపోవటంతో 'వెల్లువ' సాహిత్య మాస పత్రికను తీసుకురావటంలో ప్రత్యేక కృషి చేశారు. 'క్లాస్‌ స్ట్రగుల్‌' పత్రిక సంపాదకులు జశ్వంత్‌రావు గత సంవత్సరం అమరులైన తరువాత మధు సంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. అనారోగ్యానికి గురై ఏప్రిల్‌ 16వ తేదీన తుది శ్వాస విడిచారు. పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వంలో నడిచిన ఇంగ్లీషు పత్రికలకు, తెలుగులో తరిమెల నాగిరెడ్డి గారి సంపాదకత్వంలో వచ్చిన జనశక్తి పత్రికకు జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై రాజకీయ విశ్లేషణలను రూపొందించటంలో, సిద్ధాంత సమస్యలపైన, పార్టీ సమీక్షలను తయారు చేయడంలో గణనీయమైన పాత్ర నిర్వహించారు. కమ్యూనిస్టు విలువలతో ఆదర్శవంతమైన విప్లవ జీవితాన్ని గడిపిన మధు ఆశయాల సాధన కోసం బోల్షివిక్‌ దీక్షతో ముందుకు సాగుదాం.
 

(రేపు విజయవాడ లోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో
మధు సంస్మరణ సభ జరుగుతున్న సందర్భంగా)
- ముప్పాళ్ళ భార్గవశ్రీ,
సిపిఐఎంఎల్‌ రాష్ట్ర నాయకులు,
సెల్‌ : 9848120105