- ధాన్యం డబ్బు కోసం రైతులు పడిగాపులు
- పౌరసరఫరాల సంస్థకు అప్పు దొరికితేనే చెల్లింపులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థ సేకరించిన ధాన్యానికి నెల దాటినా రైతులకు సొమ్ము జమ కాలేదు. మూడు వారాల్లో రైతుల ఖాతాలకు జమకావాల్సిన ధాన్యం డబ్బు ఐదు వారాలు గడిచినా జమకాలేదు. దీనివల్ల రైతులు రబీ పంటల పెట్టుబడులకు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ధాన్యం సేకరణ ప్రారంభించిన దగ్గర్నుండి జనవరి 20 వరకు సేకరించిన ధాన్యానికి ప్రభుత్వం చెప్పిన గడువు 21రోజులకు కొంచెం అటు ఇటుగా చెల్లింపులు పూర్తయ్యాయి. 23.64లక్షల మెట్రిక్ టన్నులకు సుమారు రూ.2,206.17కోట్లను పౌరసరఫరాల సంస్థ రైతుల ఖాతాల్లోకి చెల్లింపులు పూర్తిచేసినట్లు సమాచారం. జనవరి 20 తర్వాత నుండి సేకరించిన ధాన్యానికి చెల్లింపులు చేసేందుకు కార్పొరేషన్ వద్ద నిధులు లేవు. కార్పొరేషన్ సమీకరించుకోవాల్సిన అప్పులు సకాలంలో రాకపోవడంతో ఇప్పుడు ఇబ్బందులు పెరిగాయి. పౌరసరఫరాల సంస్థకు రూ.5వేల కోట్ల అప్పు తీసుకునేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7న ఉత్తర్వులు జారీ చేసింది. కమర్షియల్ బ్యాంకులు, ప్రైవేటు సంస్థల నుండి అప్పు తీసుకోవాలని, దీనికి ప్రభుత్వం షూరిటీ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు నెలలు కావస్తున్నా సంస్థకు ఇప్పటికీ అప్పు లభించలేదని సమాచారం.
పౌరసరఫరాల సంస్థ జనవరి 20 నుండి ఫిబ్రవరి 25 వరకు 12.30లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. దీనికి గాను 1.91లక్షల మంది రైతులకు, అదేవిధంగా అంతకు ముందు ఉన్న కొన్ని పెండింగ్‌లతో కలిపి సుమారు రూ.2,500కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది. డబ్బులు చెల్లించలేకనే ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించిన వెబ్‌సైట్ల సర్వర్ల వేగాన్ని పౌరసరఫరాల సంస్థ తగ్గించిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తమకు రావాల్సిన డబ్బు కోసం రైతులు ఆర్‌బికెలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఖరీఫ్ సాగుకు తెచ్చిన అప్పులు చెల్లించాలని, మినుము పంటకు అయ్యే ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చులకు రైతులు కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం త్వరగా డబ్బులు చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా మార్చి నుండి రబీ ధాన్యం సేకరణ చేయాల్సి ఉంది. ఖరీఫ్ డబ్బులకే సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది, రబీకి ఏ విధంగా చెల్లింపులు చేస్తారన్నది ప్రశ్నగా ఉంది.ప్రభుత్వం ఖరీఫ్ చెల్లింపులకు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
వివిధ జిల్లాల రైతులకు పౌరసరఫరాల సంస్థ చెల్లించాల్సిన చెల్లింపుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :











