Sep 03,2022 23:01

ప్రజాశక్తి - హెల్త్‌ యూనివర్శిటీ
నేత్రదానం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని , ప్రతి ఒక్కరూ నేత్రదాన ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రముఖ వైద్యులు, స్వేఛ్చా గోరా ఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.సమరం అన్నారు. నేత్రదాన ప్రచార పక్షోత్సవాల సందర్భంగా బెంజిసర్కిల్‌ వద్ద గల వాసవ్య నర్సింగ్‌ హౌమ్‌ నందు నేత్రదాన ప్రాముఖ్యత అనే అంశంపై ఆరోగ్య సదస్సు జరిగింది. ఈసదస్సులో పాల్గొన్న డాక్టర్‌ సమరం మాట్లాడుతూ మరణించిన వ్యక్తి నేత్రదానంతో ఇద్దరు నల్లగుడ్డు అంధత్వం ఉన్న వారికి చూపుని ప్రసాదించవచ్చని తెలిపారు. నల్లగుడ్డు అంధత్వం ఒక వ్యక్తికి బాధే కాకుండా కుటుంబానికి, సమాజానికి కూడా భారం అన్నారు. అంధత్వం ఉన్న వారిలో ఎంతో ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ అవి సమాజానికి తోడ్పడకుండా పోతున్నాయన్నారు. నేత్ర దానంతో చూపుని ప్రసాదిస్తే వారు సమాజానికి ఉపయోగకరంగా మారతారన్నారు. ఆరు నెలలు నిండిన బిడ్డ దగ్గర నుండి ఏ వయసు వారైనా మరణానంతరం నేత్రదానం చేయవచ్చని తెలిపారు. మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, చత్వారం, కళ్ల మసక ఉన్నప్పటికీ వారి నేత్రాలు మరొకరికి పనికివస్తాయని తెలిపారు. పచ్చకామెర్లు, ఎయిడ్స్‌, రేబీస్‌, కేన్సరు, వైరల్‌ వ్యాధులతో మరణించిన వారి నేత్రాలు నేత్రదానానికి పనికిరావని తెలిపారు. వ్యక్తి మరణించిన ఆరు గంటలలులోగా మృతుని నుండి నేత్రాలను తీసుకోవాలన్నారు. బ్లడ్‌ గ్రూపులు, స్త్రీ, పురుష తేడాలు, చిన్నా పెద్దా వయసుతో నిమిత్తం లేకుండా నేత్రదానం చేసి కార్నియా గ్రాఫ్టింగ్‌కి పనికివస్తాయన్నారు. నేత్రంలోని కార్నియాను మాత్రమే మరొకరికి అమర్చడం ఉంటుందని మొత్తం కంటి గుడ్డుని పెట్టడం ఉండదని తెలిపారు. నల్లగుడ్డు అంధత్వం ఉన్న వారికి మాత్రమే నేత్రదానంతో చూపుని ప్రసాదించడం ఉంటుందనిఅన్నారు. ఇతర కారణాల వల్ల అంధత్వం ఉన్న వారికి కాదన్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న 30 లక్షల మంది నల్లగుడ్డు అంధత్వం ఉన్న వారికి తోడు ఏటా మరో 25వేల నుండి 30వేల మంది అంధులు అవుతున్నారన్నారు. ఏటా ఒక లక్ష కార్నియాలు అవసరం కాగా సంవత్సరానికి కేవలం 25వేల మంది మాత్రమే నేత్రదానం చేస్తున్నారన్నారు. నేత్రదానం చేయాలను కున్నవారు స్వేఛ్చా గోరా ఐ బ్యాంకు నందు గాని లేదా 9704 020 303 నందు సంప్రదించాలన్నారు. ఈకార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్‌ జి.మారు అధ్యక్షత వహించారు.