Oct 13,2022 22:54

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: మనిషి జీవితంలో ప్రతీది దృష్టితో ముడిపడి ఉందని, అందుకే కళ్లను నిర్లక్ష్యం చేయరాదని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి.శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. సంధ్య కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో వరల్డ్‌ సైట్‌ డే సందర్భంగా సూర్యారావుపేటలో గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. 'మీ కళ్లను ప్రేమించండి' అనే నినాదంతో సాగిన ర్యాలీని శ్యామ్‌ ప్రసాద్‌ ప్రారంభించి మాట్లాడుతూ కంటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసి, నేత్ర సంబంధ సమస్యల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు సంధ్య కంటి ఆసుపత్రి నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్లను అధికంగా వినియోగించడం వల్ల దృష్టి లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని, స్మార్ట్‌ ఫోన్లు చూడకుండా, వీడియో గేమ్స్‌ ఆడకుండా ఉండేలా జాగ్రత్త వహించాలని చెప్పారు. నేత్ర సమస్యలు తలెత్తిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. వరల్డ్‌ సైట్‌ డే సందర్భంగా సంధ్య కంటి ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆసుపత్రి ఎండీ మునగపాటి భార్గవ్‌రామ్‌ మాట్లాడుతూ ప్రజలందరికీ నేత్ర వైద్య సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో సంధ్య కంటి ఆసుపత్రి నెలకొల్పిన డాక్టర్‌ ఎం.ఎన్‌.రాజు ఆశయ సాధనకు కృషి చేస్తామని వెల్లడించారు. వరల్డ్‌ సైట్‌ డే సందర్భంగా వయోవృద్ధుల కోసం వారం రోజుల పాటు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రి ప్రధాన వైద్య నిపుణులు డాక్టర్‌ నాగభూషణ్‌ మాట్లాడుతూ కంటి చూపు, నేత్ర సంరక్షణ విషయంలో ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ర్యాలీలో సంధ్య కంటి ఆసుపత్రి డైరెక్టర్‌ ఎం.ఇందిర, డాక్టర్‌ శశికపూర్‌, విజయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.