'పతి' కోసం 'సతి'
నేటినుంచి 'నిజం గెలవాలి' కి శ్రీకారం
నారావారిపల్లి నుంచే భువనేశ్వరి ప్రారంభం
తిరుమల 'శ్రీవారి'కి, నాగాలమ్మకూ ప్రత్యేకపూజలు
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
ఇన్నాళ్లూ రాజకీయాల్లో ఎక్కడా కనిపించని నారా భువనేశ్వరి అనివార్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. భర్త నారా చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు పెట్టినందుకు నిరసనగా 'నిజం గెలవాలి' అంటూ నేటినుంచి సభల్లో పాల్గొననున్నారు. అలాగే చంద్రబాబును అరెస్టు చేశారని తెలిసి తట్టుకోలేక మృతిచెందిన టిడిపి శ్రేణుల కుటుంబాలను స్వయంగా పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తిరుపతికి విచ్చేసిన నారా భువనేశ్వరి 'నారా' కుటుంబానికి ఉన్న సెంటిమెంట్‌తోనే శ్రీవారి ఆశిస్సులను మంగళవారం తీసుకున్నారు. అలాగే చంద్రబాబు సొంతూరైన నారావారిపల్లిలో అత్తమామ సమాధులకు నివాళి అర్పించారు. కులదైవమైన నాగలామ్మకూ పూజలు చేశారు.
చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి'కి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంగళవారం నారా భువనేశ్వరి, చంద్రబాబునాయుడు చెల్లెలు కనుమూరి హైమావతితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 11.15 నిమిషాలకు చంద్రగిరి నియోజకవర్గాం నారావారిపల్లి చేరుకున్న ఆమె కులదైవమైన నాగలామ్మకు పూజలు చేశారు. అనంతరం అత్తమామలైన ఖర్జూరనాయుడు, నారా అమ్మణ్ణమ్మలకు నివాళి అర్పించారు. ఊళ్లో పెద్దల ఆశిస్సులు తీసుకున్నారు. జిల్లా టిడిపి అధినేతలు ఆమెను పరామర్శించారు. చంద్రగిరి మండలం అగరాల వద్ద మంగళవారం సాయంత్రం 3 గంటలకు ఐదువేల మంది మహిళలతో 'నిజం గెలవాలి' సభను నిర్వహించనున్నారు. అంతకుముందు చంద్రగిరి మండలం రంగంపేట, పాకాల మండలం నేండ్రగుంటలో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక అకాల మరణం చెందిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం నారావారిపల్లికి విచ్చేసి తన తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి మధ్యాహ్నం సభలో పాల్గొంటారు. ఎంఎల్‌సిలు పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, చంద్రగిరి నియోజకవర్గం ఇన్‌ఛార్జి పులివర్తినాని, నందమూరి లోకేశ్వరి కుమార్తె చాముండేశ్వరి, మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్‌వర్మ, తెలుగు యువత రాష్ట్ర నాయకులు రవినాయుడు, మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మ తదితరులు ఉన్నారు.
భువనేశ్వరి సభను విజయవంతం చేద్దాం: డాక్టర్ బాలసుబ్రమణ్యం
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి బుధవారం అంకుర హాస్పిటల్ వద్ద బహిరంగ సభను నిర్వహించనున్నారని, నిజం గెలవాలి పేరుతో నిర్వహించే ఈ సభను విజయవంతం చేద్దామని టిడిపి మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం పిలుపునిచ్చారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఈ సభకు సంబంధించిన పోస్టర్లను టిడిపి నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే తిరుపతి ఎంతో అభివద్ధి చెందిందన్నారు. ప్రజలకు చంద్రబాబు సేవలు ఎంతో అవసరమని ఆనాడు అలిపిరి బాంబు బ్లాస్ట్ ఘటనలో తిరుమల శ్రీవారు ఆయన ప్రాణాలను రక్షించారని అన్నారు. చంద్రబాబు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాక్షస ఆనందాన్ని పొందుతున్న నేపథ్యంలో నారా భువనేశ్వరి తన ఆవేదనను ప్రజలకు వివరిస్తూ బస్సు యాత్ర చేస్తారన్నారు. ఎవరు ఎన్ని చేసినా అంతిమ విజయం న్యాయందేనని, చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి నాయకురాలు అంబూరు సింధుజ, టిడిపి శాలివాహన సాధికార సమితి తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు ఆముదాల తులసీదాస్, తెలుగు యువత నాయకులు పెరుమాళ్ మధు, హిమత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో నారా భువనేశ్వరి
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. భువనేశ్వరితో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఉన్నారు. దర్శనం అనంతరం అర్చకులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతంరం ఆమె నారావారిపల్లెకు బయలుదేరారు. బుధవారం నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర నారావారిపల్లె నుంచి ప్రారంభం కానుంది. గెలవాలి అనే పేరిట ఆమె ఈ యాత్రను చేపట్టనున్నారు.
నారావారిపల్లిలో...










