Jan 25,2023 21:23

ఫొటో : మాట్లాడుతున్న కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి

నేటి నుంచి 'విష్ణు శంఖారావం'

ప్రజాశక్తి - కావలి : అల్లూరు మాజీ ఎంఎల్‌ఎ కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీలతో సంబంధం లేకుండా తానే సొంతంగా గ్రామాలు తిరిగి తాను ఆఖరుసారిగా ఎంఎల్‌ఎగా పోటీచేస్తున్నట్లు, ప్రజల్లో తిరిగి, ఓటర్ల సానుభూతిని పొందేందుకు ''విష్ణు శంఖారావం'' పేరుతో గురువారం నుండి ప్రచారం సాగించనున్నారు. ఈ మేరకు బుధవారం కావలిలోని ఆయన సొంత కార్యాలయంలో తన అనుచరులు అనంతరాజు బాలకృష్ణంరాజు, గోసల గోపాలరెడ్డి, పూనూరు మురళీధర్‌రెడ్డి, అనుమోలు శెట్టి శివ, దరిశి సురేష్‌ తదితర అనుచరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదట కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా అల్లూరు నియోజకవర్గంలో ఎంఎల్‌ఎగా గెలిచానని తెలిపారు. ఆతరువాత అదే పార్టీలో ఉంటూ పలువురి గెలుపుకోసం కృషి చేశామన్నారు. 2014లో కావలి నియోజకవర్గం నుండి పోటీ చేశానన్నారు. 2019లో నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టిడిపి టిక్కెట్‌మీద కావలి నియోజకవర్గంలో పోటీచేసి దాదాపు 84వేల ఓట్లను పొందగలిగామన్నారు. ఎన్నికల సమయం నుండి నేటి వరకు తనను టిడిపి పట్టించుకోలేదని, కనీసం తనకు, తన అనుచరులకు పార్టీ సభ్యత్వం కూడా కల్పించలేదన్నారు. చివరకు దిశా నిర్దేశం కోసం తాను రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నానని, తనకు ఇదే ఆఖరు ఎన్నికగా పేర్కొంటూ, తనను గెలిపించాలని ఓటర్లను కోరతామన్నారు. గ్రామగామాలు తిరిగి, ప్రజల సమస్యలను విచారిస్తానని, వాటి పరిష్కారం కోసం అవసరమైతే పోరాటం చేస్తామని తెలిపారు. తాను పదవిలో ఉన్నా, లేకపోయినా తన అనుచరుల కోసం తిరిగినపుడు అధికారులు పార్టీలకతీతంగా తనకు సహకరించారన్నారు. తన అనుచరుల నిర్ణయం మేరకు పార్టీలతో సంబంధం లేకుండా కనీసం సంవత్సరం రోజుల వ్యవధిలో తాను స్వంతంగా ప్రజలను కలుసుకుంటున్నానని, తాను తనజీవితంలో ఆఖరుసారిగా ఎంఎల్‌ఎగా పోటీచేస్తానని, తనకు సహకరించాలని ప్రజలను కోరారు.