- బాధ్యతలు స్వీకరించనున్న కలెక్టర్లు
- సిఎం వీడియో కాన్ఫరెన్స్‌తో ప్రారంభం కానున్న పాలన
- భారీగా అధికారుల బదిలీలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి కొత్త జిల్లాలు ఉనికిలోని రానున్నాయి. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి విడుదల చేసిన తుది గెజిట్ నోటిపికేషన్ ఆధారంగా నూతన జిల్లా కేంద్రాల్లో అధికారయంత్రాంగం నేటి నుండి విధులు నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో గెజిట్‌లో పేర్కొన్న కలెక్టరేట్లలో సోమవారం ఉదయం కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించాలని పేర్కొన్నారు. కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొట్టమొదటి అధికారిక కార్యాక్రమంగా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. సిఎం కార్యాలయం నుండి అందిన సమాచారం మేరకు ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కొత్త జిల్లాల కలెక్టర్లకు సిఎం అభినందనలు తెలియచేయడంతో పాటు, ప్రభుత్వ పాలనా ప్రాధాన్యతల గురించి దిశా నిర్ధేశం చేస్తారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే కలెక్టర్లు జిల్లాలోని వివిధ స్థాయిల అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
కొత్త కలెక్టరేట్ల చిరునామాలు
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ల భవనాల్లో ఆయా జిల్లాకు కేటాయించిన కలెక్టర్లు సోమవారం బాధ్యతలు స్వీకరించాలని సిఎస్ సమీర్‌శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా హెడ్‌క్వార్టర్‌గా ఎంపిక చేసిన భవనం శ్రీకాకుళం పట్టణంలోని కొత్తపేట జంక్షన్‌లో కలెక్టరేట్ ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా విజయనగరం హెడ్ క్వార్టర్స్‌గా కంటోన్మెంట్‌లో , పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటు కాబోతోంది.
కార్యాలయం న్యూ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ అథారిటీ, ప్రకాశం టౌన్‌హాల్ ఎదురు, బెల్గామ్, పార్వతీపురంలో ఏర్పాటు కానుంది. విశాఖపట్టణం హెడ్ క్వార్టర్‌గా ఉన్న జిల్లా కు మహారాణిపేటలోనూ, అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటైన జిల్లాకు కలెక్టరేట్ ఇండో అమెరికన్ ఇనిస్టి ట్యూట్ (పూర్ణమ హల్) డోర్ నెంబరు 1, శంకరం విలేజ్, అనకాపల్లి లోనూ ఏర్పాటు కానుంది. పాడేరు కేంద్రంగా ఏర్పాటు కానున్న అల్లూరి సీతారామరాజు జిల్లా ,యూత్ ట్రైనింగ్‌సెంటర్ బిల్డింగ్, కుమ్మరిపుత్తు, పాడేరులోనూ, కాకినాడ కేంద్రంగా ఏర్పాటైన జిల్లాకు కలెక్టర్ ఆఫీస్ రాజారామమోహన్‌రారు రోడ్డు, కాకినాడలో ఏర్పాటు కానుంది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లాకు అమలాపురంలోని డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ అథారిటీ బిల్డింగ్, డోర్‌నెంబరు 1-1-77, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, ముక్తేశ్వరరోడ్‌లో కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటవుతున్న తూర్పుగోదావరి జిల్లాకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్, ఎన్‌హెచ్ -16 హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా, ధవలేశ్వరం గ్రామం, రాజమహేంద్రవరం రూరల్‌లో కలెక్టరేట్ ఏర్పాటు కానుంది. ఏలూరు కేంద్రంగా ఏర్పాటైన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఏలూరులోని ఇండోర్‌స్టేడియం ఎదురు, కొత్త బస్టాండుకు దగ్గరలోని ఎన్‌ఆర్‌పేటలో ఏర్పాటు చేస్తున్నారు. భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు కానున్న పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం భీమవరంలోని మారుతీనగర్ ప్రకృతి ఆశ్రమం ఎదురు, శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు కానుంది. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణ జిల్లా కలెక్టరేట్ భవనం డోర్‌నెంబరు 20/171, చిలకలపూడి, మచిలీపట్నంలోనూ, విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన ఎన్‌టిఆర్ జిల్లాకు విజయవాడ గాందీరోడ్డు, బాపు మ్యూజియం పక్కన డోర్‌నెంబరు 27-20-44లో ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు కేంద్రంగా జిల్లా కలెక్టరేట్ భవనం నగరంపాలెంలోనూ, బాపట్ల జిల్లా కేంద్రంగా ఏర్పాటవుతున్న జిల్లా కలెక్టరేట్ బాపట్లని ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ క్యాంపస్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ నందు, నరసరావుపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు అవుతున్న పల్నాడు జిల్లాకు నరసరావుపేటలోని లింగంగుంట్లలోని డోర్‌నెంబరు 3-126, లింగంగుంట్ల కాలనీ, వాటర్ రీసోర్స్ డిపార్టుమెంట్ బిల్డింగ్(ఎన్‌ఎస్‌పి సర్కిల్ ఆఫీస్) నరసరావుపేటలోనూ. ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఒంగోలు ట్రంక్‌రోడ్డు లోనూ, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆచారి వీధి, నెల్లూరులోనూ, తిరుపతి కేంద్రంగా ఏర్పాటైన జిల్లా తిరుపతిలోని శ్రీ పద్మావతి నిలయం, పూతలపట్టు-నాయుడుపేటహైవే, తిరుచానూరు, తిరుపతి రూరల్‌లో ఏర్పాటు చేశారు. చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం రెడ్డి గుంటలోనూ, రాయచోటి కేంద్రంగా ఏర్పాటు కానున్న అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ భవనం రాయచోటిలోని మాసాపేటలోని గవర్నమెంట్ బిల్డింగ్, రింగ్‌రోడ్డు సర్కిల్ దగ్గర, రాజీవ్ స్వగృహ పక్కన, వైఎస్‌ఆర్ కడప జిల్లా కడపలోని న్యూ కలెక్టరేట్ 'సి' బ్లాక్ రిమ్స్ రోడ్డులోని ఆర్ట్స్ కాలేజీ (మెన్)లోనూ, అనంతపురం కేంద్రంగా అనంతపురం కలెక్టరేట్ బెంగుళూరు రోడ్డులోని బుద్దప్పనగర్‌లోనూ, పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటైన శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ భవనం పుట్టపర్తిలోని మెయిన్‌రోడ్డు, గోకులంలోని సత్యసాయి మిర్పురి కాలేజీ ఆఫ్ మ్యూజిక్‌లో నూతన కలెక్టరేట్ ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని బుధవారపేట , గవర్నమెంటు జనరల్ హాస్పిటల్ ఎదురు, నంద్యాల కేంద్రంగా ఏర్పాటవుతున్న జిల్లా కలెక్టరేట్ భవనం నంద్యాల నూనేపల్లి లోని రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌స్టేషన్ బిల్డింగ్స్‌లో కలెక్టరేట్‌ల భవనాలు ఏర్పాటు కానున్నట్లు సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
భారీగా ఐఎఎస్, ఐపిఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు :
కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోలను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 47 మంది డిప్యూటీ కలెక్టర్లు/ఆర్డీఓలను బదిలీ చేస్తూ సిఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. 26 జిల్లాలకు నియమించబడిన కలెక్టర్లు వీరే:శ్రీకాకుళం: ఎల్‌ఎస్ బాలాజీరావు, విజయనగరం : ఎ. సూర్యకుమారి, పార్వతీపురం మన్యం: నిషాంత్‌కుమార్ , విశాఖపట్ణణం :ఎ.మల్లికార్జున, అల్లూరి సీతారామరాజు జిల్లా: సుమిత్‌కుమార్ , అనకాపల్లి : పి,రవిసుభాష్, కాకినాడ : కృతికాశుక్ల, తూర్పుగోదావరి :కె.మాధవీలత, కోనసీమ: హిమాన్షుశుక్లా, పశ్చిమగోదావరి :పి.ప్రశాంతి, ఏలూరు : వి.ప్రసన్న వెంకటేష్, కృష్ణ: పి.రంజిత్‌భాష, ఎన్‌టిఆర్ జిల్లా: ఎస్ డిల్లీరావు, గుంటూరు: ఎం.వేణుగోపాల్‌రెడ్డి, పల్నాడు: శివశంకర్‌లతోటి, బాపట్ల : విజయ, ప్రకాశం : దినేష్‌కుమార్, నెల్లూరు: కెవిఎన్ చ క్రధర్‌బాబు, తిరుపతి, కె. వెంకట్రామిరెడ్డి, చిత్తూరు : ఎం, హరినారాయణ, అన్నమయ్య: గిరీష పిఎస్, వైఎస్‌ఆర్ కడప: విజయరామరాజు, శ్రీసత్యసాయి: బసంత్‌కుమార్, అనంతపురం : ఎస్. నాగలక్ష్మీ, నంద్యాల : ఎం.జిలానీ సమూన్, కర్నూలు: పి.కోటేశ్వరరావులను నియమించారు.
జిల్లాల ఎస్పీలు వీరే :
జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో బాగంగా పలువురు ఐపిఎస్ అధికారులను కూడా ఫ్రభుత్వం బదిలీ చేసింది. పార్వతీపురం: వి విద్యాసాగర్‌నాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లా : సతీష్‌కుమార్, అనకాపల్లి:గౌతమిషాలిని, కాకినాడ: ఎం రవీంద్రబాబు, కోనసీమ: సుబ్బారెడ్డి, ఏలూరు : అమ్మిరెడ్డి, ఎన్‌టిఆర్ జిల్లాకు:క్రాంతిరాణా టాటా,(విజయవాడ కమిషనరు) పల్నాడు: రవిశంకర్‌రెడ్డి, బాపట్ల: వకుల్ జిందాల్, తిరుపతి: పరమేశ్వరరెడ్డి, అన్నమయ్య: హర్షవర్దన్‌రాజు, శ్రీ సత్యసాయి జిల్లాకు: రాజుదేవ్ సింగ్, నంద్యాల జిల్లా : రఘువీరారెడ్డిలను ఎస్పీలుగా ప్రభుత్వం నియమించింది. అలాగే ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళంకు: రాధిక, విజయనగరంకు దీపికాపాటిల్, విశాఖపట్నం కమిషనర్‌గా సిహెచ్ శ్రీకాంత్, తూర్పుగోదావరికి ఐశ్వర్య రస్తోగి, పశ్చిమ గోదావరికి రవిప్రకాష్, కృష్ణాకు సిద్దార్థ కౌశల్, ప్రకాశంకు మల్లికాగార్గ్, నెల్లూరుకు విజయరావు, చిత్తూరు రిశాంత్‌రెడ్డి, కడపకు అన్సురాజన్, అనంతపురంకు కె ఫకీరప్ఫ, కర్నూలుకు సుధీర్‌కుమార్‌రెడ్డిలను అలాగే కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రవిశంకర్ అయన్నార్‌కు స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో కమిషనరుగా అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
72 రెవెన్యూ డివిజన్‌లు....
జిల్లాల పెంపుదలతో 13 జిల్లాలుగా ఉన్న రాష్ట్రం 26 జిల్లాలుగా ఏర్పడింది. పాలనా సౌకర్యం కోసం 51 రెవెన్యూ డివిజన్లను 72కి పెంచారు. దీంతో పలు ప్రాంతాల్లో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి. 1974 ఎపి డిస్ట్రిక్ట్స్ (ఫార్మేషన్) ప్రకారం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది. లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు అని అనుకున్నప్పటికీ ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ప్రజాప్రతినిధుల సూచనలతో స్వల్ప మార్పులతో తుది గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. పార్లమెంటు నియోజక వర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంటును రెండు .జిల్లాలుగా ఏర్పాటు చేశారు. పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలతో పార్వతీపురంమన్యం జిల్లా ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు పేరుతో అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం, నియోజకవర్గాలతో కలిపి ఏర్పాటు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సరాసరి 18నుంచి 20 లక్షల జనాభా ఉండే విధంగా జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.










