- కృష్ణాజిల్లా ఎస్‌పి జాషువా
ప్రజాశక్తి - కలెక్టరేట్ (కష్ణా) : సరిహద్దులను కాపాడేది సైనికులైతే, సమాజంలో అంతర్గత శాంతి భద్రతలను పరిరక్షించేది పోలీసులని కృష్ణాజిల్లా ఎస్‌పి పి జాషువా పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శుక్రవారం కష్ణాజిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి తొలుత పోలీసు అధికారులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌పి జాషువా మాట్లాడుతూ పోలీసుల విధి నిర్వహణకత్తి మీద సాములాగా క్లిష్టతరంగా ఉంటాయన్నారు. అసాంఘిక శక్తులతో పోరాడుతూ సమాజంలో శాంతిభద్రలను కాపాడేందుకు అహర్నిశలూ పాటుపడుతూ ఎంతోమంది పోలీసులు అమరులవుతున్నారని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. భౌతికంగా మన మధ్య వారు లేకున్నా మన హదయంలో చిరస్మరణీయలుగా ఉంటారన్నారు. శాంతియుత సమాజ స్థాపనకు విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. అడిషనల్ ఎస్‌పి (అడ్మిన్) ఎన్ వెంకట రామాంజనేయులు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అమరులైన 264 మంది పేర్లను చదివి నివాళులర్పించారు. పెరేడ్ కమాండర్ ఆర్‌ఐ వెంకట్రావు గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌పి (ఎస్‌ఇబి) అస్మా ఫర్హిన్, ఎఎస్‌పి (ఎఆర్) ఎస్‌విడి.ప్రసాద్, డిఎస్‌పిలు, ఇన్‌స్పెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులు, ఇతర పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది, జిల్లాలో అమరులైన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈఏడాది విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం తరఫున కార్పస్ ఫండ్ చెక్కులను ఎస్‌పి అందజేశారు. అనంతరం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ జిల్లా పోలీస్ పెరేడ్ మైదానం నుంచి జిల్లా కోర్టు సెంటర్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్‌పి జెండా ఊపి ప్రారంభించారు.










