Oct 25,2023 21:50

నేషనల్‌ బాడ్మింటన్‌ పోటీలలో గౌస్‌ జట్టుకు గోల్డ్‌ మెడల్‌

నేషనల్‌ బాడ్మింటన్‌ పోటీలలో గౌస్‌ జట్టుకు గోల్డ్‌ మెడల్‌
ప్రజాశక్తి -గూడూరు:గోవాలో నిర్వహించిన 37వ జాతీయ స్థాయి షటిల్‌ బాడ్మింటన్‌ క్రీడా పోటీలలో మిక్సెడ్‌ డబుల్స్‌ విభాగంలో ఆంధ్ర జట్టు క్రీడాకారులు ఛాంపియన్స్‌ గా నిలిచి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఈ నెల 26వ తేదీ నుండి నవంబర్‌ 9వ తేదీ వరకూ గోవాలో షటిల్‌ బాడ్మింటన్‌ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ పోటీలలో ఆంధ్ర రాష్ట్రం తరపున మిక్సెడ్‌ డబుల్స్‌ విభాగంలో షేక్‌ గౌస్‌, పూజా దండు జట్టు ప్రాతినిధ్యం వహించారు. ఫైనల్స్‌ లో తెలంగాణ జట్టు క్రీడాకారులు నవనీత్‌ బొక్కా, కే. మనీషా జట్టుపై వరుస రెండు సెట్లలో గెలుపొంది నేషనల్స్‌ టైటిల్‌ కైవసం చేసుకున్నారు. ఆంధ్ర షట్లర్లు నేషనల్‌ ఛాంపియన్స్‌ గా నిలవడంతో రాష్ట్రంలో షటిల్‌ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గూడూరులో సంబరాలు
గూడూరు నివాసి షేక్‌ గౌస్‌ మిక్సెడ్‌ డబుల్స్‌ లో నేషనల్‌ ఛాంపియన్‌ గా నిలవడంతో ది యంగ్‌ గూడూర్‌ షటిల్‌ బాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్‌ సభ్యులు మాట్లాడుతూ మూడు నెలల క్రితం గౌస్‌ ఆల్‌ ఇండియా సీనియర్‌ ర్యాంకింగ్స్‌ టైటిల్‌ సిద్ధార్థ్‌ తో కలిసి కైవసం చేసుకున్నాడని, విజయాల పరంపర కొనసాగిస్తున్న గౌస్‌ అంతర్జాతీయ స్థాయిలోనూ చక్కగా రాణించాలని ఆకాంక్షించారు.