Jan 17,2023 18:21

సిబ్బందితో మాట్లాడుతున్న డిఎస్‌పి కేశప్ప

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : నేరాల నియంత్రణకు సిబ్బంది కృషి చేయాలని డిఎస్‌పి కేశప్ప పేర్కొన్నారు. మంగళవారం స్థానిక టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలు నియంత్రణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలన్నారు. ప్రజా ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. దీర్ఘకాలిక కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. రౌడీషీటర్లు, పాతనేరస్థులను స్టేషన్‌కు రప్పించి. కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. వారి కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. పదేపదే నేరాలకు పాల్పడే వారిపై రౌడీషీట్లు ఓపెన్‌ చేయాలన్నారు. రాత్రిపూట గస్తీ, పోలీస్‌ పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలన్నారు. లేకుంటే చోరీలు, ఇతర నేరాలు జరిగే అవకాశం ఉందన్నారు. భార్యాభర్తల ఫిర్యాదులపై వెంటనే కేసులు నమోదు చేయకుండా ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ద్వారా కాపురాలను చక్కదిద్దాలని పేర్కొన్నారు. జూదగృహాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, లాడ్జీల్లో దాడులు నిర్వహించాలని తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించాలన్నారు. నేరప్రవృత్తి. కలిగి ఉన్నవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల దర్యాప్తు, నేరస్తుల అరెస్టుపై సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం స్టేషన్‌ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రూరల్‌ సిఐ శివాంజనేయులు, ఎస్‌ఐలు చంద్రమోహన్‌, హరిహరప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.