చండీగఢ్ : తాను ఉగ్రవాదిని కానని ఎన్నికల ద్వారా ప్రజలు నిరూపించారని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. పంజాబ్‌లో అప్ అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆప్ విజయంపై వర్చువల్‌గా కేజ్రీవాల్ స్పందించారు. కేజ్రీవాల్ ఉగ్రవాది కాదని, ఆయన భారతమాత బిడ్డని, నిజమైన దేశభక్తుడని ప్రజలే చెప్పారని అన్నారు. ఆప్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీ మాత్రమే కాదని, పార్టీకన్నా ఎక్కువని, ఇదొక విప్లవమని అన్నారు. ఇది మార్పు కోసం, విప్లవం కోసం చూస్తున్న సమయని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులైన చరణ్‌జీత్ సింగ్ చన్ని, నవజ్యోత్ సింగ్ సిద్ధు, అమరీందర్ సింగ్, విక్రమ్ మజితియాలను ఆప్ ఓడించిందని వెల్లడించారు. సామాన్య ప్రజలను నిరాశకు గురిచేయవద్దని, వారు అత్యంత శక్తి వంతులని అన్నారు. భారీ మెజారిటీ సాధించినందుకు భయపడుతున్నామని, అహంకారంతో వ్యవహరించడం లేదని చెప్పారు.










