Jan 18,2023 22:27

ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

         గాండ్లపెంట : తెలుగు సమాజానికి తన పద్యాల ద్వారా వెలుగులు నింపిన వేమనకు కొండంత వెలుగును ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 19వ తేదీన వేమన జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా, గాండ్లపెంట మండలం కటారుపల్లి గ్రామంలో ఉన్న వేమన సమాధి ప్రాంతంలో వేమన జయంతి ఉత్సవాల ప్రారంభ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు గురువారం నాడు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9గంటలకు కటారుపల్లి గ్రామంలో వేమన సమాధి వద్ద జరిగే వేమన జయంతి ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కతి శాఖ మంత్రి ఆర్‌కె.రోజా, రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషచరణ్‌శ్రీ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించనున్నారు. వీరితో పాటు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు డా||పివి.సిద్ధారెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌తో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఇతర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు హాజరు కానున్నారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలందరూ వేమన సమాధిని దర్శించుకోనున్నారు. తరువాత కటారుపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుని అక్కడ జరిగే సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌
కటారుపల్లిలో గురువారం జరగనున్న శ్రీ యోగి వేమన జయంతి ఉత్సవాల ఏర్పాట్లను కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం శాఖ మేనేజర్‌ నాగేశ్వర్‌ రెడ్డి, డివిఎం చంద్రమౌళి, టూరిజం శాఖ ఈఈ ఈశ్వరప్ప, తహశీల్దార్‌ రవి, ఎంపీడీవో డి.అంజినప్ప, ఎంపిపి తాత జగన్మోహన్‌, వైసీపీ మండల కన్వీనర్‌ పోరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, మాజీ జడ్పిటిసి కె.భాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.