ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి :తూర్పు రాయలసీమ ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నేడు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయత్రం 4 గంటల వరకు ఓటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. డిస్ట్రిబ్యూటర్ నెంటర్ నుంచి ఎన్నికల సామాగ్రిని సిబ్బంది ఆయా కేంద్రాలకు తరలించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల బరిలో మొత్తం 22 మంది పోటీపడుతున్నారు. టీచర్ ఎన్నికలకు ఎనిమిది మంది ఉన్నారు. ఇందులో ప్రధానంగా పిడిఎఫ్,. వైసిపి, టిడిపి మధ్య పోటీ నెలకుంది. నేటి సాయంత్రం తర్వాత బ్యాలేట్ బాక్స్‌లను చిత్తూరుకు తరలించనున్నారు.
నేడు జరగనున్న గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎంఎల్‌సి ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఉదయం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్. చక్రధర్ బాబు, నెల్లూరు నగరంలోని డి.కె.డబ్ల్యూ కళాశాలలో నెల్లూరు డివిజన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించి పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించి అధికారులకు, పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. చక్రధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు డివిజన్ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఓటర్ మార్క్ కాపీతో పాటు పోలింగ్ సామాగ్రిని సంబంధిత పోలింగ్ సిబ్బందికి ఇచ్చారు. నేటి ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలై సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుతో పాటు వేసవికాలం దష్ట్యా పోలింగ్ రోజున ఓటర్లుకు తాగునీటి సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎంఎల్‌సి ఎన్నికల నిర్వహణకు గాను 1350 మంది పోలీసు సిబ్బందిని, 1729 మంది పోలింగ్ పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన పెన్నుతో మాత్రమే మార్క్ చేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శంగా సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్నీ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాష్టింగ్ నిర్వహించడంతో పాటు సూక్ష్మ పరిశీలకులను నియ మించారు. ఓటర్లందరికి ఓటరు స్లిప్స్‌ను పంపిణీ చేశారు. ఓటరు ఓటు వేసేందుకు ఓటర్ స్లీప్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, భారతీయ పాస్ పోర్ట్ వంటి 12 రకాల ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డును తీసుకురావాల్సి వుంటుందని తెలిపారు. గుర్తించిన క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు వెబ్ కాస్టింగ్ లైవ్ ఏర్పాటుతో పాటు అదనంగా పోలీసు సిబ్బందిని నియమిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. డివిజన్, జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ విధానంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు.
పట్టభద్రుల బరిలో 22 మంది.. టీచర్ బరిలో 8 మంది ..
తూర్పు రాయలసీమ ఎంఎల్‌సి ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి కోసం 22 మంది అభ్యర్థులు టీచర్స్ కోసం 8 మంది అభ్యర్థులు పోటీ పడుతు న్నారు. ప్రధాన పోటీ పిడిఎఫ్, వైసిపి, టిడిపి మధ్య నెలకొంది. పిడిఎఫ్ గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సిగా మీగడ వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లాకు చెందిన కంచర్ల శ్రీకాంత్ చౌదరి (టిడిపి) తిరుపతి జిల్లా కోట మండలానికి చెందిన శ్యాం ప్రసాద్ రెడ్డి పేర్నాటి (వైసిపి), తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన సన్నారెడ్డి దయాకర్ రెడి తరపున ఎస్.జగదీశ్వర నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. (బిజెపి) టీచర్స్ ఎంఎల్‌సి పిడిఎఫ్ అభ్యర్థిగా పి. బాబురెడ్డి వైసిపి నుంచి చంద్రశేఖర్ రెడ్డి పర్వత రెడ్డి పోటీలో ఉన్నారు.










