హ్యూస్టన్ : తెలుగమ్మాయి బండ్ల శిరీష(34) ఆదివారం అంతరిక్షంలోకి ప్రయాణించనుంది. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్ చెందిన వీఎస్‌ఎస్ యూనిటీ వ్యోమనౌకలో ఆమె రోదసిలోకి దూసుకెళ్లనుంది. అమెరికాలోని న్యూ మెక్సికో నుండి ఈ ప్రయోగం ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. మానవ సహిత వ్యోమనౌక వీఎస్‌ఎస్ యూనిటీ-22ను వీఎంఎస్ ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళుతుంది. అనంతరం అక్కడి నుంచి రాకెట్ ద్వారా యూనిటీ-22 మరింత ఎత్తుకు వెళుతుంది. చివరి దశలో సొంత ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు మరో అయిదుగురు ప్రయాణించనుండగా వారిలో శిరీష ఒకరు. రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ల అనంతరం నాలుగో వ్యోమగామిగా శిరీష అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించిన శిరీష.. హ్యూస్టన్‌లో పెరిగారు. ఇక్కడే విద్యనభ్యసించి ఏరోనాటికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు-పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఆమె ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాల్యం నుండి వ్యోమగామి కావాలనుకున్న తాను, ఎట్టకేలకు ఆదివారం తన కలను నెరవేర్చుకోనున్నట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం తనకెంతో సంతోషంగా ఉందని శిరీష ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే.. వచ్చే ఏడాది నుండి ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది వర్జిన్ సంస్థ.










