Oct 28,2023 22:32

నేడే... వేమన విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవం



నేడే... వేమన విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవం

భవనాన్ని ప్రారంభించనున్న ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి
ముఖ్యఅతిథిగా ప్రముఖ పాత్రికేయులు తెలకపల్లి రవి హాజరు
'సమతా స్వాప్పికుడు వేమన ' పుస్తకాన్ని ఆవిష్కరించనున్న విఠపు
ముస్తాబైన పలవలి రామకృష్ణారెడ్డి, ఎజి యతిరాజుల సభామందిరాలు
వేమన పద్యభావ చిత్రలేఖనం ఎగ్జిబిషన్‌ , నృత్యరూపకం ప్రదర్శన

ప్రజాశక్తి- తిరుపతి
'భూమిలోనబుట్టు భూసారమెల్లను.... తనువులోనబుట్టు తత్వమెల్ల.... శ్రమలోనబుట్టు సర్వంబుతానౌను' అంటూ 350 ఏళ్ల క్రిందటే శ్రమ విలువను ఎంతో గొప్పగా ఆవిష్కరించి, శ్రమతత్వాన్ని చాటిన ప్రాత:స్మరణీయుడు వేమన అందించిన విజ్ఞానాన్ని నేటితరానికీ విస్తరించారన్న ధృఢసంకల్పంతో తిరుపతి కేంద్రంగా ఏర్పాటైన 'వేమన విజ్ఞానకేంద్రం' నేడు ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. కరోనా కాలం నుంచే పలు సామాజిక, సేవా, సాంస్కతిక, చైతన్య పూరిత కార్యక్రమాలను తిరుపతి నగరంలో నిర్వహిస్తున్న ఆ వేమన విజ్ఞాన కేంద్రం ఇకపై సకల కళలకు కేంద్రంగా భాసిల్లనుంది. తిరుపతి, యశోదనగర్‌లో ఏర్పాటైన ఈ నూతన భవనాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఉదయం ప్రారంభించనున్నారు. దీనికి ముఖ్యఅతిథులుగా ప్రముఖ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు తెలకపల్లి రవి హాజరై ఈ సమాజానికి వేమన చేసిన సేవలను, చూపిన మార్గాన్ని వివరించనున్నారు. అలాగే 'సమతా స్వాప్నికుడు వేమన' పుస్తకాన్ని మాజీ ఎంఎల్‌సి, విద్యావేత్త విఠపు బాలసుబ్రమణ్యం ఆవిష్కరించనున్నారు. ప్రముఖ మార్క్సిస్టు నేత, మదనపల్లికి చెందిన న్యాయవాది పలవలి రామకష్ణారెడ్డి పేరిట నిర్మించిన సభా మందిరాన్ని ఆయన కుమార్తె మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య పలవలి కుసుమకుమారి ప్రారంభించనున్నారు. ప్రముఖ అభ్యుదయ అనువాద రచయిత ఏజీ యతిరాజులు పేరిట నిర్మించిన సభా మందిరాన్ని ఆయన భార్య ఏజీ చంద్రమ్మ ప్రారంభించి తిరుపతి వాసులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సందర్భవంగా ఏర్పాటు చేసిన 'వేమన పద్యభావ చిత్రలేఖనం' ఎగ్జిబిషన్‌ను అతిథులు ప్రారంభించి, వేమన నృత్యరూపకాన్ని ప్రదర్శించనున్నారు. అనంతరం నిర్వహించనున్న సభకు తిరుపతి బాలోత్సవం గౌరవాధ్యక్షులు టెంకాయల దామోదరం అధ్యక్షత వహించనున్నారు.
నేడు పద్యానికి పట్టాభిషేకం ర్యాలీ..
వేమన విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 9.30 గంటలకు టిటిడి పరిపాలనా భవనం నుంచి యశోదనగర్‌లోని విజ్ఞాన కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ కేంద్రం ప్రధాన కార్యదర్శి మల్లారపు నాగార్జున పేర్కొన్నారు. తిరుపతి బాలోత్సవం ఆధ్వర్యంలో ఇప్పటికే వేమన పద్యాలను రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు పోటీలను నిర్వహించినట్లు గుర్తుచేశారు. తిరుపతిలో వేలాదిమంది విద్యార్థులు వేమన పద్యాలను కంఠస్తం చేసి నేటి సమాజ స్థితిగతులకు అన్వయం చేసుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా వేలాదిమంది విద్యార్థులు 'వేమన పద్యాలను ప్రదర్శిస్తూ విజ్ఞానకేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారని తెలిపారు. కవులు, రచయితలు, లలిత- జానపద కళలకు, విద్యా- వైజ్ఞానిక, శాస్త్రీయ ఆలోచనలను పెంచే కేంద్రంగా వేమన విజ్ఞానకేంద్రం నిలవబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో తిరుపతి వాసులందరూ పాల్గొనాలని నాగార్జున పిలుపునిచ్చారు.