నైపుణ్యాభివృద్ధితో ఉద్యోగ అవకాశాలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : యువత చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధి, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే ఉజ్వల భవిష్యత్తు సాధించవచ్చని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ యువత ఉజ్వల భవిష్యత్తు కోసం మాజీమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆశయాల సాధనలో భాగంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. మాజీమంత్రి మేకపాటి గౌతమడ్డి కుమార్తె, ఎంజిఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ అనన్యారెడ్డితో కలిసి శుక్రవారం ఆయన స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించారు. 'వర్క్వెర్స్' సంస్థ సహకారంతో ప్రారంభించిన ఈ శిక్షణ మూడు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా ఉచితంగా యువత భవిష్యత్ కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, దీనిని ఏడాదిలో రెండు మార్లు నిర్వహిస్తామన్నారు. ఉద్యోగాలకు ఎంపికయ్యే యువత అనేక అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సరైన స్కిల్స్ లేక గతంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో కేవలం 150 మంది మాత్రమే ఎంపికయ్యారన్నారు. దాని దృష్ట్యా స్కిల్స్ యువతకు అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డైరెక్టర్ అనన్యారెడ్డి మాట్లాడుతూ తన తండ్రి గౌతమ్‌రెడ్డి ఆశయ సాధన కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. జాతీయ, అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో సులభతరంగా ఉద్యోగాలు సాధించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. వర్క్వేర్స్ కంపెనీ నిర్వాహకులు సైనిక్ చక్రవర్తి, మేనేజరు. రుచికలు స్కిల్స్‌పై పలు విషయాలను బోధించారు. మొయిన్ అనే పాలటెక్నిక్ విద్యార్థి ఆంగ్లంలో సైనిక్ చక్రవర్తి చెబుతున్న అంశాలను తెలుగులో వివరించారు. కార్యక్రమంలో పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.










