ప్రజాశక్తి- మదనపల్లె అర్బన్ : పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలోని పుల్లారెడ్డివీధికి చెందిన చేనేత కార్మికుడు రమణ, భవన నిర్మాణ కార్మికుడు రవి సోమవారం రాత్రి నాటుసారా తాగి మృతిచెందిన విషయం విదితమే. మంగళవారం ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు, ఎఎస్‌పి రాజమల్లు మదనపల్లెకు చేరుకుని మరణాలపై సమగ్ర విచారణ చేపట్టారు. పుల్లారెడ్డివీధికి చేరుకుని ఘటనపై బాధిత కుటుంబ సభ్యులను, స్థానికులను విచారించారు. వారి నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆ వీధిలోని చిల్లర దుకాణం చుట్టూ సారా ప్యాకెట్లు పడిఉండడాన్ని గుర్తించారు. సారా విక్రేతల వివరాలను సేకరించారు. అనంతరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ కార్మికుల మరణాలపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు చెప్పారు. రమణ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, శ్వాసకోశ సమస్యలతో మగ్గం పనులు మానేసి వైద్యం చేయించుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారన్నారు. మద్యం సేవించకూడదని వైద్యులు చెప్పినా వినకుండా బలవంతంగా సేవించి ప్రాణాలు కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. రవి పూర్తిగా మద్యానికి బానిస కావడంతో శరీరంలో అవయవాలు చెడిపోయి తీవ్ర అనారోగ్యం బారినపడ్డారన్నారు. మందులు తినకుండా యధాప్రకారం సారా సేవించి మరణించాడని బాధిత కుటుంబ సభ్యులు చెప్పినట్లు వివరించారు. కార్మికులు అనారోగ్యంతో బాధపడుతూ పూటుగా నాటుసారా సేవించి మృతిచెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. మరణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతుల శరీర అంతర్గత భాగాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్‌ఎన్‌ఎల్)కు పం పుతున్నామన్నారు. మెడికల్ రిపోర్టు ఆధారంగా మరణాలకు గల కారణాలు తెలుస్తాయన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. సబ్ డివిజన్‌లో నాటుసారా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్‌ఎస్‌ఇబి పోలీసులతో కలసి సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూ నివారణకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. గత నెలలో 92 సారా కేసులు నమోదు కాగా, 56 మందిని అరెస్టు చేసి వారినుంచి 407 లీటర్ల సారా స్వాధీనంతో పాటు 17.910 లీటర్ల ఊటను ధ్వంసం చేశామన్నారు. గతేడాది 1,767 మద్యం కేసులు నమోదు కాగా 9,039 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ ఏడాదిలో సారా కేసులు పెరిగే అవకాశం ఉందని వివరించారు. జిల్లాలో 97 ప్రాంతాలను సారా రహిత గ్రామాలుగా గుర్తించామన్నారు.










