నాశిరకంగా రోడ్డు పనులు
ప్రజాశక్తి-కావలి : కావలి రూరల్ మండలంలోని మాతినవారిపాలెం నుండి సర్వాయపాలెంకు వేసే సిసి రోడ్డు నిర్మాణ పనులు నాశిరకంగా జరుగుతున్నాయని, అధికారులు స్పందించి, సంబంధిత గుత్తేదారులపై చర్యలు చేపట్టాలని టిడిపి కావలి నియోజకవర్గం ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు డిమాండ్ చేశారు. సోమవారం అయన సంబంధిత రోడ్డు పనులను పరిశీలించారు. నిర్మాణానికి అక్కడి తోటల్లోని మట్టి సముద్రపు ఇసుక ఉపయోగిస్తున్న విషయాన్ని గమనించి అయనతో పాటు ఉన్న మండల పార్టీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, ఎంపిటిసి జంపాని శ్రీనివాసులు, టిడిపి నాయకులు సందు వెంకయ్య, మన్నెం రామయ్య, మన్నెం తిరుపతిలు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే గ్రామ సర్పంచ్ ఇస్సారపుయానాదితో సుబ్బానాయుడు, పార్టీ నాయకులు మాట్లాడి, నిర్మాణ పనుల్లో భారీ అవకతవకలు జరుగుతున్నాయని, నాణ్యత లోపం కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుందని, ఇకనైనా నాణ్యతాపరమైన రోడ్డుని నిర్మించాలని కోరారు. ప్రజాధనాన్ని అక్రమంగా అర్జిస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించి వెనుతిరిగారు. కాసేపటి తరువాత అల్లిగుంటపాలెం గ్రామస్తులు తుళ్లూరు స్వాములు అనే వ్యక్తి ఎంపిటిసి జంపాని శ్రీనివాసులుకు ఫోన్ చేసి నానా దుర్భాషలాడి, భయానక పదజాలంతో బూతులు తిట్టడం జరిగింది. ఈ మేరకు ఎంపిటిసి జంపాని శ్రీనివాసులు తుళ్లూరు స్వాములు అనే వ్యక్తిపై కావలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు.










