కాశీ రాజ్యాన్ని రుద్రవర్మ పాలించేవాడు. అతని పుట్టినరోజు నాడు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇందుకుగానూ గ్రామాధికారులకు లక్ష మొక్కలు పంపిణీ చేసి, వాటిని నాటించమని చెప్పేవాడు. ఓసారి ఇలాగే మొక్కలు పంపిణీ చేస్తున్న ప్రకటన తెలుసుకుని, సీతాపురం రైతు రామయ్య, రాజు కొలువుదీరిన సభకు వచ్చాడు.
'మహారాజా! నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి' అన్నాడు రామయ్య. 'అలాగే' అన్నాడు రాజు.
'మహారాజా! మీ మొక్కల పంపిణీ కార్యక్రమం ఎంతో ఉత్తమమైనది. కానీ మొక్కలు పొందినవారు వాటిని నాటాక వాటి ఆలనా, పాలనా చూసే బాధ్యత కూడా వారిదే కదా?' అన్నాడు రామయ్య. 'అవును' అన్నాడు రాజు.
'మరి మీరు పోయినసారి లక్ష మొక్కలను నాటమన్నారు.. అందులో ఎన్ని బతికాయో అన్న సమాచారం కూడా ఉండాలి' అన్నాడు.
మహారాజు నివ్వెరపోయాడు. మంత్రి నోరెళ్లబెట్టాడు. సభ మళ్లీ మూడు రోజులకు సమావేశమవుతుందని, అప్పటికల్లా గ్రామాధికారులు మొత్తం మొక్కల సమాచారం తీసుకు రమ్మని మంత్రిని ఆదేశించాడు. ఆ రోజు రామయ్యనూ రమ్మన్నాడు.
మూడు రోజుల తరువాత రాజ్యంలోని మొత్తం యాభై గ్రామాలకు చెందిన గ్రామాధికారులు మొక్కల సమాచారంతో వచ్చారు. వారితో పాటు రామయ్య కూడా వచ్చాడు. గ్రామాధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం లక్ష మొక్కలకుగాను రెండు వేల మొక్కలే జీవం పోసుకున్నాయి అని తేలింది. రాజు నివ్వెరపోయాడు.
'అవును మహారాజా!.. ఒక్కొక్కరి వద్ద రెండు, మూడు మొక్కలే జీవం పోసుకుని చెట్లగా పెరిగాయి' అన్నారు నలభై తొమ్మిది గ్రామాలకు చెందిన గ్రామాధికారులు. సీతాపురం గ్రామానికి చెందిన 50వ గ్రామాధికారి మాట్లాడుతూ 'మహారాజా! మా గ్రామంలో ఒక్క రామయ్యకు ఇచ్చిన ఇరవై ఐదు మొక్కల్లో ఇరవై నాలుగు మొక్కలు ఇంటి పెరటిలోనూ, పొలంలోనూ పెరిగి చెట్లయ్యాయి' అన్నాడు.
'మహారాజా! గాలిలో దీపం పెట్టి నీదే భారం దేవుడా! అంటే కుదరదు మీరు నారు ఇచ్చారు. నీరు పోసే బాధ్యతా మీదే. అంటే మీకు బదులుగా ప్రజలది.. మీరు మొక్కలయితే ఇస్తున్నారు. కానీ వాటిని సంరక్షించే బాధ్యతను పట్టించుకోవడం లేదు' అన్నాడు రామయ్య.
'రామయ్యా నీవు ఎంతో ధైర్యంగా మంచి విషయాలు చెప్పావు. నీకు ఇచ్చిన మొక్కలను పెంచి, పెద్ద చేసినందుకు నీకు నూరు వరహాలు బహుమతిగా ఇస్తున్నాను' అన్నాడు రాజు.
ఆ వరహాలను తీసుకుని 'మహారాజా! ఇప్పుడు మీరు అందిస్తున్న మొక్కలకు నీరు పెట్టడానికి, వాటి ఆలనా పాలనా చూసుకోవడానికి నిరుద్యోగులను నియమించి, ఈ వరహాలను వారికి జీతం కింద ఇవ్వండి' అని చెప్పి వాటిని రాజుకు తిరిగి ఇచ్చాడు రామయ్య. సభ చప్పట్లతో మారుమోగింది.
'గ్రామాల్లోని ఇంటి పెరటిలో మొక్కల పెంపకం ఆ ఇంటివారు చూసుకోవాలి. రాచబాటలకు ఇరువైపులా పెంచే బాధ్యతను నిరుద్యోగులకు అప్పగించి, తగిన వేతనం ఇస్తాము.. అంతేకాదు ప్రతి వారం మొక్కల పర్యవేక్షణను నేనే స్వయంగా నిర్వహిస్తాను. మొక్కల విషయంలో నా కళ్లు తెరిపించిన రామయ్యను అభినందిస్తున్నాను' అన్నాడు రాజు.
గ్రామాధికారులు కూడా తమవంతు బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాము అని సభలో వాగ్దానం చేశారు.
'పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో దోహదపడుతుంది. దీంతో దేశ పురోభివృద్ధి కూడా జరుగుతుంది' అన్నాడు రామయ్య. రాజు, మంత్రితో సహా సభలోని వారు 'నీ మాటలు అక్షర సత్యాలు' అని రామయ్యను ఎంతో కొనియాడారు.
యు. విజయ శేఖరరెడ్డి
99597 36475