May 25,2023 22:43

మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి

ప్రజాశక్తి-హిందూపురం : ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న నారాయణ కళాశాలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా హిందూపురం పట్టణంలో ఉన్న నారాయణ కళాశాల ముందస్తు ప్రచారాలు నిర్వహిస్తు, అడ్మిషన్లు నిర్వహిస్తోందన్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఒక్కొక్క విద్యార్థి దగ్గర రూ.40 వేల నుంచి 50 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారన్నారు. ఎంసెట్‌, జెఇఇ మెయిన్స్‌ పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులని ఆకర్షించి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. అంతే కాకుండా పాఠ్యపుస్తకాలు పేరుతో అదనంగా రూ. 6 వేల నుంచి 8వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారన్నారు. విద్యను వ్యాపారం చేసిన నారాయణ కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో కళాశాలపై ప్రత్యక్ష దాడులకు పాల్పడుతామని, దానికి పూర్తి బాధ్యత విద్యాశాఖ అధికారులే వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హర్ష కుమార్‌, నవీన్‌, లిఖిత్‌, భగత్‌, మహేష్‌, వినోద్‌, ప్రసన్న, రోహిత్‌, షాహిద్‌ తదితరులు పాల్గొన్నారు.