May 26,2023 23:02

నాశిరకంగా ఉన్న సబ్సిడీ వేరుశనగ నాయకులు

        కదిరి టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలు నాణ్యత లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి ఎద్దేవా చేశారు. రైతులకు పంపిణీ చేసిన విత్తన వేరుశనగ కాయలను శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను అన్ని విధాలుగా ఆదుకుని, రాష్ట్రంలో రైతు రాజ్యం తెస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రస్తుతం రైతులకు పంపిణీ చేస్తున్న సబ్సిడీ విత్తన వేరుశెనగ కాయలు నాణ్యతగా లేవన్నారు. కాంట్రాక్టర్లు ప్రాసెసింగ్‌ చేయకుండా రైతుల నుంచి కొనుగోలు చేసిన కాయలను యధా తథంగా సంచుల్లో నింపి రాళ్లు, మట్టితో కలిసిన వాటినే సరఫరా చేస్తున్నారని ధ్వజమెత్తారు. విత్తన పంపిణీ కేంద్రాల వద్ద కాయలను పరిశీలించిన రైతులు అవి విత్తనానికి పనికిరావని, తమకు అవసరం లేదని కాయలు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. విత్తన వేరుశనగ నాణ్యతను పరిశీలించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తు న్నారని పేర్కొన్నారు. అవసరం ఉంటే తీసుకోండి లేదంటే రిటర్న్‌ పంపమని రైతులకు ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు 90 వేల క్వింటాళ్లు అవసరం కాగా ఇప్పటివరకు కేవలం 20వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయని, అవి కూడా నాణ్యతగా లేవన్నారు. ఉన్నతాధికారులు స్పందించి నాశిరకం విత్తన కాయలు పంపిణీ చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని నాణ్యమైన విత్తన వేరుశనగ కాయలు సకాలంలో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఎక్కడికక్కడ రైతు భరోసా కేంద్రాల వద్ద పంపిణీని అడ్డుకుంటామని హెచ్చరించారు.