నిజం బయటకు రావాలి..న్యాయం గెలవాలి
తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే
మీడియాతో వివేకా కుమార్తె సునీత
ప్రజాశక్తి-పులివెందుల టౌన్ : తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, ఈ కేసులో నిజాలు కచ్చితంగా బయటకు రావాలని, న్యాయం గెలవాలని, తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని డాక్టర్ సునీత అన్నారు. బుధవారం వివేకా నాల్గవ వర్ధంతి సందర్భంగా పులివెందులలోని ఆయన ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు ఎవరికి జరగకూడదు, అందుకోసమే నేను న్యాయపోరాటం చేస్తున్నానని, నిజం బయటకు రావాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని పేర్కొన్నారు. నాకు తెలిసిన విషయాలు దర్యాప్తు సంస్థకు డాక్యుమెంట్స్ రూపంలో వెల్లడించానని, హత్య ఎవరు చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలి పెడతానన్నారు. కొంతమంది దర్యాప్తు సంస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని, విచారణ సందర్భంగా ఎవరైనా మాట్లాడం సరికాదన్నారు. దర్యాప్తు సంస్థలు, పోలీసుల విచారణ సక్రమంగా జరిగేలా అందరూ సహకరించాలన్నారు. కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నానని నాకు కూడా తెలుసన్నారు. హత్య కేసులో ప్రయేయం ఉందని నమ్ముతున్నందునే వారిపై సిబిఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నానని తెలిపారు. హత్యపై రాయలసీమలో ఇలాంటి మామూలేనని గతంలో కొందరు తేలిగ్గా మాట్లాడడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 30 ఏళ్ల క్రితం గొడవలు మళ్లీ మొదలయ్యా అనిపిస్తోందని పేర్కొన్నారు. నాన్నను ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెట్టగలనన్నారు. నాకు తెలియని వాళ్లు ఎంతో మంది సహకరిస్తున్నరని వారికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్.వివేకానందరెడ్డికి నివాళులర్పించిన వారిలో కుమార్తె సునీతతో పాటు అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, వైఎస్.ప్రతాప్‌రెడ్డి, నరెడ్డి శివప్రకాష్‌రెడ్డి ఉన్నారు.










