- పెద్దల అండతో అడ్డగోలుగా భూ దందా
- రూ.కోట్ల విలువైన 1.19 ఎకరాలు సొసైటీకి ధారాదత్తం
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : ఈ చిత్రంలో కనిపిస్తున్న బోర్డు 2018లో చినగదిలి తహశీల్దార్ నరసింహమూర్తిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసింది. 'ఈ భూమి ప్రభుత్వానికి చెందినది. ఎవరైనా ఆక్రమిస్తే శిక్షార్హులు' అంటూ జిల్లా కలెక్టర్ పేరుతో అప్పట్లో దీనిని ఏర్పాటు చేశారు. ఇటీవల ఈ మండలానికి వచ్చిన తహశీల్దార్ రామారావు 'ఈ భూమి ప్రభుత్వానిదేనని, అయితే, 1981-1982లో రెండు దఫాలుగా ఓసెన్ డ్రైవ్ కో-ఆపరేటివ్ సొసైటీకి ఈ భూమిని ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉందని చెప్తూ భూమిని ఆ సొసైటీకి ధారాదత్తం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
విశాఖ సాగర తీరానికి అభిముఖంగా జూ పార్కు వెనుక భాగంలో సర్వే నెంబరు 151/10లో ఎకరా 19 సెంట్ల విస్తీర్ణంలో ఈ భూమి ఉంది. ఇక్కడ గజం భూమి విలువ లక్ష రూపాయల వరకూ పలుకుతోంది. ఈ లెక్కన ఈ భూమి విలువ కోట్లలో ఉంటుంది. ఈ భూమిలో ఈ సొసైటీ తాజాగా గోడ నిర్మాణం చేపట్టింది. గతంలో కూడా ఇదే ప్రయత్నాలు చేయడంతో అప్పటో రెవెన్యూ అధికారులు అడ్డుకొని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఎండాడ, గుడ్లవానిపాలెం, సాగర్ నగర్‌కు చెందిన రైతులు గతంలో ఇక్కడ సాగులో ఉండేవారు. దీంతో సొసైటీకి, రైతులకు మధ్య 2015 నుంచి వివాదం నడుస్తోంది. తాజాగా ఈ భూమిని సొసైటీకి దఖలు పర్చడం, 1981-1982 సంవత్సరాల్లో నిర్ణయించినట్లు చెప్తున్న ధర ఎకరా రూ.16 వేలకు చొప్పునే ఇచ్చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా, ప్రస్తుతం ఈ సొసైటీ ఉనికిలో ఉందో? లేదో? తేల్చకుండానే భూమిని ధారాదత్తం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని, కేంద్ర పాలక పార్టీకి చెందిన, ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఒక వ్యక్తి అండదండలు, ఆయన సూచనలకు అనుగుణంగా వ్యవహరించిన అధికారులు దీని వెనుక ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన విశాఖ ఎప్పుడు వచ్చినా ఈ సొసైటీ కార్యదర్శి ఇంట్లోనే బస చేయడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. జివిఎంసి ఎనిమిదో వార్డు పరిధిలో ఈ భూమి ఉంది. ఈ పరిధిలోని పేదల నుంచి ఇళ్ల స్థలాల కోసం 3,334 దరఖాస్తులు వచ్చాయి. ఈ భూముని పరిరక్షిస్తే వారికి ఇళ్ల స్థలాలుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పేదలు కోరుతున్నారు. గతంలో సాగులో ఉన్న రైతులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.










