మాట్లాడుతున్న ట్రైనీ కలెక్టర్
నాడు-నేడు పనులు పూర్తి చేయాలి
కొడవలూరు :మండలంలో జరుగుతోన్న నాడు-నేడు పనులను జూన్ 10వ తేదీ. కల్లా పూర్తి చేయాలని ట్రైనీ కలెక్టర్ జి.విద్యాధరి ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నాడు-నేడు పనులు జరుగుతున్న 23 పాఠశాలల హెచ్‌ఎంలతో మంగళవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో నాడు-నేడు కింద 23 పాఠశాలలకు రూ.6.54 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇప్పటికే తొలి విడతగా రూ.1.82 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో ఇప్పటి దాకా రూ.1.12 కోట్లు ఖర్చు చేయగా, ఇంకా రూ.70 లక్షల నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. సిమెంట్ అందుబాటులోకి వచ్చినందున త్వరగా పనులు పూర్తి చేసేందుకు హెచ్‌ఎంలు కషి చేయాలని చెప్పారు. ప్రతి రోజూ జరుగుతున్న ప్రోగ్రెస్‌ను ఎప్పటికప్పుడు యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. పాఠశాలలు పునః ప్రారంభ సమయానికి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని సూచించారు. తొలుత ఆమె గండవరం, కొడవలూరు, టపాతోపు, పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. సమావేశంలో ఎంపిడిఒ సుబ్రహ్మణ్యం, ఎంఇఒ వసంతకుమారి, సిఆర్‌పిలు వీరాంజనేయులు, జె. పెంచలయ్య ఎం.దయాకర్ పాల్గొన్నారు.










