నాడు-నేడు పనులు పూర్తి చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రెండోదశ నాడు-నేడు పనులను పూర్తి చేయాలని మండల విద్యాశాఖ అధికారి షేక్ మస్తాన్‌వలీ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని ఎంపిపిఎస్ జి చెర్లోపల్లి, ఎంపిపిఎస్ వడ్డెపాలెం, ఎంపిపిఎస్ బిజ్జంపల్లి మెయిన్, జిల్లా ఉన్నత పాఠశాల బిజ్జంపల్లి పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బిజ్జంపల్లి పాఠశాలలో జరుగుతున్న మనబడి నాడు-నేడు రెండోదశలో మంజూరైన నూతన టాయిలెట్స్, అదనపు తరగతి గదుల నిర్మాణాలను పరిశీలించారు. ప్రభుత్వం కొంతవరకు నిధులు మంజూరు చేసిన ప్రధానోపాధ్యాయులు టి.వెంకటేశ్వర్లు, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు కె.చంద్రశేఖర్ రెడ్డి, జి.వెంకటేశ్వర్లు తమ సొంత నిధులను పెట్టి అదనపు తరగతి గదులను స్లాబ్ వేయించినందుకు వారిని అభినందించారు. ఎంపిపిఎస్ జి చెర్లోపల్లి పాఠశాలలో మనబడి నాడు-నేడు మొదటిదశలో మంజూరైన వాటర్ ప్యూరిఫైర్‌ను పరిశీలించారు. అనంతరం గ్రీన్ చాక్‌బోర్డుపై విద్యార్థుల గణిత సామర్థ్యాలను పరిశీలించి పాఠశాల రికార్డ్‌లను టాయిలెట్స్, మధ్యాహ్న భోజన విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










