నాడు-నేడు పనులు పరిశీలన
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని రొంపిదొడ్ల గ్రామంలోని హైస్కూలు సంబంధించిన నాడు-నేడు పనులను బుధవారం కందుకూరు సబ్ కలెక్టర్ శోభిక పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి, అధికారులకు కాంట్రాక్టులకు తగు సూచనలు చేశారు. నిర్ణీత కాలంలో పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తర్వాత వరికుంటపాడు మండలంలోని తహశీల్దారు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించిన సబ్ కలెక్టర్ తహశీల్దారు హమీద్‌కు తగు సూచనలు చేశారు. మండలంలో జరుగుతున్న భూ పంపిణీపై జగనన్న శాశ్వత భూ హక్కు భూ రీసర్వే పలు అంశాలపై రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వరికుంటపాడు సర్పంచ్ కొండేపోగు దిలీప్ సబ్ కలెక్టర్ దృష్టికి పలు భూ సమస్యలను తీసుకురాగా వాటిని పరిశీలించి సమస్యను పరిష్కరించాలని తహశీల్దారు హమీద్‌కు సూచించారు. మండలంలోని పలు గ్రామాల ప్రజలు భూ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని సంబంధిత అధికారులకు సూచనలు చేసి త్వరితగతిన వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. వరికుంటపాడు మండల పరిధిలోని పలు అసైన్మెంట్ భూములకు సంబంధించి పలు రికార్డులను సబ్ కలెక్టర్ పరిశీలించారు.










