Jun 16,2023 21:36

నాడు-నేడు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు - జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

రాయచోటి :మనబడి, నాడు-నేడు రెండో విడత సంబంధించి అన్ని తరగతి గదులు, ఎలక్ట్రికల్‌, మరుగుదొడ్ల రిపేర్లు, నూతన వంటగది, మరుగుదొడ్ల నిర్మాణాలు జూన్‌ 30వ తేదీ నాటికి పూర్తీ చేయాలని సంబంధిత అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో మనబడి నాడు-నేడు పనుల పురోగతిపై మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఒలు, మండల విద్యాశాఖ అధికారులు, ఫీల్డ్‌ ఇంజినీర్‌లతో జాయింట్‌ కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనబడి నాడు నేడు పనులు ఆశించినటువంటి స్థాయిలో జరగటం లేదని, పనుల వేగవంతం చేయాలని సూచించారు. నత్తనడకన జరుగుతున్న సంబంధిత మండలాల అధికారులకు జాయింట్‌ కలెక్టర్‌ హెచ్చరించారు. అందులో భాగంగా రేపటి వారానికి ఎన్ని పనులు పూర్తీ చేయగలరో అందరి నుండి యాక్షన్‌ ప్లాన్‌ తీసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలలో అదనపు తరగతి గదుల నిర్మాణంలో చోటు చేసుకున్న జాప్యానికి సిడిపిఒల నుండి వివరణ కోరారు. ప్రధానోపాధ్యాయులు మారిన నాడు నేడు పాఠశాలల్లో మూడు రోజుల్లో బ్యాంకు అకౌంట్లు వారి పేరు మీద మార్చుకొని, పనులకు అంతరాయం లేకుండా కొనసాగించాలని పేర్కొన్నారు. నిర్దిష్ట సమయానికి పూర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో డిఇఒ కార్యాలయ ఎడి ప్రసాద్‌బాబు, సిఎంఒ కరుణాకర్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ ప్రసన్న కుమార్‌, మురళీధర్‌, డిఇ సుధాకర్‌ పాల్గొన్నారు.మాట్లాడుతున్న జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌