నత్తనడకన భవన నిర్మాణాలు
20 శాతం లోపే పనులు పూర్తి
శిథిలావస్థ భవనాల్లో చిన్నారుల చదువులు
ప్రజాశక్తి-రాయచోటి : ఎంతో ఆర్భాటంగా అట్టహాసంగా ప్రారంభించారు. ఆపై చేతులెత్తేశారు. ఇదీ జిల్లాలో నాడు-నేడు పథకం కింద చేపట్టిన భవన నిర్మాణాల దుస్థితి. పనుల పరిస్థితి చూస్తుంటే నత్తనకు నడకలు నేర్పుతున్నట్లుగా ఉంది. గతేడాది జూన్‌లో పనులకు శ్రీకారం చుట్టి.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఐతే పనులు సాగుతున్న తీరు, సామగ్రి కొరతతో.. గడువును ఈ ఏడాది జూన్ నాటికికి పెంచారు. అప్పటికైనా నిర్మాణాలు పూర్తవుతాయా అంటే.. అదీ చెప్పలేని పరిస్థితి..
రాష్ట్రంలో కర్పొరెట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు-నేడు పనులను చేపట్టింది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పనులు జిల్లాలో నత్తనడకన నిర్మాణాలు సాగుతున్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం, కొన్నిచోట్ల ఆలస్యం కావడం,కోర్టు, వివిధ కారణాల వల్ల భవన నిర్మాణ పనుల్లో ఆలస్యంగా జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొదటి విడత పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో రెండువ విడతలో నాడు-నేడు కింద రూ.348 కోట్లు అంచనాతో 1037 భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 20 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల పనులు మొదలు పెట్టలేదు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో వసతులు సరిగ్గా లేవని ఉద్దేశంతో నాడు-నేడు పథకం కింద జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాడు-నేడు నిర్మాణ పనుల బాధ్యతను పాఠశాల విద్యా కమిటీ విభాగానికి అప్పగించారు. జిల్లాలో రెండవ విడత జూనియర్ కళాశాలలో 21, అంగన్వాడీ కేంద్రాలు 141, మిగిలిన ప్రభుత్వ పాఠశాలను 875 భవనాల పనులు ప్రారంభించారు. మరుగుదొడ్లు, తరగతి గదులు నిర్మాణం, తాగునీరు ఏర్పాటు, ప్రహరీ గోడ, వంటగది, ఇతర పనులను చేపడుతున్నారు. ఇప్పటి వరకు 20 శాతం పూర్తయినాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మిగిలినవి వివిధ దశలలో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు చెబుతున్నారు. మిగిలిన 80 శాతం పూర్తవ్వాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో వేచిచూడాలి. చేసిన పనులకు సకాలంలో బిల్లు రాకపోవడం మిగిలిన పని పూర్తి చేసిన బిల్లుల వస్తాయనే నమ్మకం లేకపోవడంతో పలువురు కాంట్రాక్టర్లు పనులను వదిలేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలలో వసతి సమస్య కారణంగా ఉపాధ్యాయులు, విద్యార్థులకు పూర్తిస్థాయిలో నాణ్యమై విద్యను అందించలేక అందించలేకున్నామని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కొన్ని పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో తరగతి గదులు సరిపోవడంలేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కొన్ని అంగన్వాడీ సెంటర్లకు అద్దె కట్టుకోలేక, సకాలంలో బిల్లులు రాక అంగన్వాడీ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం జూన్ నాటికి పనులు వంద శాతం పూర్తి చేయాలని పేర్కొంటోంది. సకాలంలో పనులు పూర్తిస్థాయిలో అవుతాయో లేదో వేచి చూడాల్సిందే.
నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం
జిల్లాలో నాడు-నేడు భవన నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నాం. ప్రధానోపాధ్యాయులతో రోజూ సమీక్షలు నిర్వహించి, నిర్మాణాల పురోగతిని తెలుసుకుంటున్నాం. గతంలో బిల్లుల చెల్లింపుల్లో కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం చేసిన పనులకు బిల్లులు వెంటనే విడుదలవుతున్నాయి. జూన్ నాటికి పూర్తి స్థాయిలో భవన నిర్మాణ పనులను పూర్తి చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం.
- వై.రాఘవరెడ్డి, డిఇఒ, రాయచోటి.










