చిలమత్తూరు:ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా పాఠశాలల అభివద్ధి, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు నిధులను మంజూరు చేస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో పలు అభివృద్ధి పనులనూ చేపట్టారు. నాడు-నేడు అభివృద్ధి పనులను ఇలా ఉంచితే నూతన విద్యావిధానం పేరుతో తీసుకొస్తున్న కొత్త సంస్కరణలు పాఠశాలల మనుగడకే ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్నాయి. నూతన విధ్యావిధానానికి అనుగుణంగా ఇప్పటికే పలు పాఠశాలలను ప్రభుత్వం విలీనం చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలు విలీనం పేరుతో మూతబడ్డాయి. నాడు-నేడు ద్వారా అభివృద్ధి చేసిన పాఠశాలలు కూడా విలీనం కావడంతో ఆ తరగతి గదులన్నీ ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. అభివద్ధి పేరుతో ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రజాధనం వథా అయ్యింది.
అభివృద్ధి.. అనంతరం విలీనం..!
వైసిపి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాల్టీలతో పాటు, ఆయా గ్రామాల్లో పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ నిధులతో నిర్మాణ పనులనూ పూర్తి చేశారు. పనుల అనంతరం ఆర్భాటంగా ప్రజాప్రతినిధులు వాటిని ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉన్నా, విలీనం అంశం రాగానే కొత్త కష్టాలు వచ్చాయి. అన్ని వసతులతో పాఠశాల ఉన్నా, అది వేరే పాఠశాలలో విలీనం కావడంతో నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. విలీనం అయిన పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ప్రభుత్వ నిర్ణయం ఎంత తెలివితక్కువగా ఉందో ఇట్టే అర్థం అవుతోంది. చిలమత్తూరు మండలంలో మొదట విడతలో సోమగట్ట ప్రాథమిక పాఠశాలకు రూ.12.67 లక్షలు, చిలమత్తూరు ప్రాథమిక పాఠశాలలో రూ.19 లక్షలతో నాడు-నేడు కింద అభివృద్ధి పనులు చేశారు. ఈ పనులు జరిగే సమయంలో సోమగట్ట పాఠశాలలో 56 మంది విద్యార్థులు ఉన్నారు. నూతన విద్యావిధానం అమల్లోకి రావడంతో ఈ పాఠశాలలోని 3,4,5 తరగతులు పక్క పాఠశాలలోకి విలీనం అయ్యారు. ఇక్కడున్న విద్యార్థులు వేరే పాఠశాలలకు వెళ్లడంతో సోమగట్ట పాఠశాలలో ప్రస్తుతం 20 మంది విద్యార్థులే మిగిలారు. చిలమత్తూరు ప్రాథమిక పాఠశాలలో 111 మందికి గాను విలీనం అనంతరం 37 మంది మిగిలారు. ఇక్కడ విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న కారణంతో ఈ పాఠశాలలను మూసివేత దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అవగాహన రాహిత్యమేనా.?
నాడు-నేడు పనులు, విలీనం అంశాలను పరిశీలిస్తే అధికారుల అవగాహన రాహిత్యమా.? ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతాయి. చిలమత్తూరు మండల వ్యాప్తంగా రెండవ విడతలో ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీలతో కలుపుకుని 30 పాఠశాలను ఎంపిక చేశారు. ఇందులో గాడ్రాళ్లపల్లి ప్రాథమిక పాఠశాల, చిలమత్తూరు బీసి కాలనీలోని పాఠశాలలను రెండవ విడతలో నాడు-నేడు కోసం ఎంపిక చేశారు. విద్యాశాఖ అధికారుల తెలిపిన వివరాల మేరకు ఎంపిక చేసే సమయంలో గాడ్రాళ్లపల్లిలో 26 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులోని 3,4,5 తరగతుల విద్యార్థులను చిలమత్తూరు హైస్కూల్‌లో విలీనం చేయడంతో ఆ సంఖ్య 11కు పడిపోయింది. అప్పటికే ప్రభుత్వం ఈ పాఠశాలలో నాడు-నేడు కింద రూ.12 లక్షలతో అభివృద్ధి పనులను చేసింది. ఇక చిలమత్తూరు బీసీ కాలనీలోని పాఠశాల ఎంపిక సమయంలో 37 మంది ఉండగా 3,4,5 తరగతులను చిలమత్తూరు హైస్కూల్‌లో విలీనం చేయడంతో ప్రస్తుతం ఆ పాఠశాలలో 11 మంది విద్యార్థులే మిగిలారు. ఈ పాఠశాల అభివృద్ధికి రూ.12 లక్షలతో పనులు జరిగాయి. విలీనం అనంతరం విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో వచ్చే సంవత్సరం చిలమత్తూరు బీసీ కాలనీలోని పాఠశాల ఉంటుందా.? ఉండదా..? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
అభివృద్ధి చేయాల్సిన పాఠశాలను గాలికి వదిలేసి...
నాడు-నేడు ద్వారా అభివృద్ధి చేయాల్సిన పాఠశాలల ఎంపిక విషయంలో అధికారులు సరైన ప్రణాళికతో ముందుకెళ్లలేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన పాఠశాలలను వదిలేసి, విలీనం అయ్యే పాఠశాలల్లో పనులు చేసి నిధులను వృథా చేశారు. చిలమత్తూరు మండల పరిధిలోని వీరాపురం పంచాయతీలో ఉన్న వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. మొదట విడత నాడు-నేడులో ఎంపిక చేసి గ్రామంలో ఉన్న పాఠశాలకు మరమతులు చేశారు. అయితే ఇక్కడ తరగతి గదులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేవు. దీంతో లక్ష్మీపురం సమీపంలో దాతలు, ఎంపిపి పురుషోత్తమ రెడ్డి సహకారంతో అదనపు గదులు నిర్మించారు. ఈ పాఠశాలలో 6,7,8 తరగతులలో 90 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలను వచ్చే ఏడాది జిల్లా పరిషత్తు పాఠశాలగా మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. పెరిగిన విద్యార్థుల సంఖ్య రిత్యా విద్యాశాఖ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేసేందుకు యోచిస్తుంది. విద్యార్థులు ఎక్కువగా ఉన్న ఇలాంటి పాఠశాలను రెండోవిడత నాడు-నేడుకు ఎంపిక చేయకపోవడం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంకు అద్దంపడుతోంది. ఇలా పలు ప్రభుత్వ పాఠశాలలు నాడు-నేడు, విలీనం రెండు విధాలుగా నష్టపోతున్నాయి. నూతన విద్యావిధానం పేరుతో పాఠశాలలను మూసి వేయకుండా అన్నింటిలోనూ అభివృద్ధి చేసి ప్రభుత్వ విద్యను మరింత పటిష్టం చేసే దిశగా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.










