లక్నో : 'మాది కష్టజీవల పార్టీ, రైతన్నలే మా ప్రాధాన్యత' అని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అన్నారు. గురువారం యుపిలోని మైన్‌పురీ జిల్లా నికర్హాల్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. 82 ఏళ్ల వయస్సులోనూ ఆయన ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. తమ పార్టీ తొలి ప్రాధాన్యత రైతు అని, వ్యవసాయోత్పత్తులు పెంచడానికి నీటీ పారుదల, విత్తనాలు, ఎరువుల సౌకర్యాలను అందించాలని ములాయం తెలిపారు. దిగుబడులు పెరిగితేనే రైతుల పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు. రైతులు, వ్యాపారులు, యువత మాత్రమే దేశాన్ని బలోపేతం చేయగలరని చెప్పారు. ఈ ఎన్నికల్లో తన కుమారుడు, మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్‌ను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వయస్సు, అనారోగ్యం కారణంగా రాజకీయ కార్యక్రమాలకు ములాయం దూరంగా ఉంటున్నారు. కర్హాల్ నుంచి అఖిలేష్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఇదే స్థానంలో బిజెపి నుంచి కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ పోటీ చేస్తున్నారు. గురువారం ఆయన తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం నిర్వహించారు.










