Migrants: ఎర్రజెండా నీడలో అందరం ఒక్కటే..! : కేరళలో స్థిరపడ్డ అతిథి కార్మికుల అంతరంగం
కన్నూర్ : ఖాకీ యూనిఫారం వేసుకుని తాలిపరంబా వీధిలో వస్తున్న ఒక యువకుడికి ఎదురుగా తన అంకుల్ సంతోష్ మామన్‌ను కలుసుకోగానే సంతోషంతో ముఖం విప్పారింది. స్థానిక ప్రజలు మాట్లాడుకునే యాసకు చాలా భిన్నమైన రీతిలో చక్కటి మలయాళంలో తన మామను పలకరించాడు. మరింత మెరుగైన జీవనోపాధిని వెతుక్కుంటూ కేరళకు వచ్చిన లక్షలాదిమంది కార్మికుల్లో భువనేశ్వర్‌కి చెందిన జగన్నాథ్ ఒకరు. సంతోష్ మామన్ సిపిఎం తాలిపరంబ ఏరియా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ''సిపిఎం అంటే నాకెంతో ఇష్టం.'' అని జగన్నాథ్ వ్యాఖ్యానించారు. ఏరియా కమిటీ కార్యాలయం నా సొంత ఇల్లులా అనిపిస్తుంది. పార్టీ కార్యక్రమాలన్నింటికీ హాజరవుతా, తాలియారంబూ పట్టణ శాఖ సభ్యుడిని, 23వ మహాసభలకు రెడ్ వలంటీర్‌ని అని జగన్నాధ్ చెప్పాడు. కాఫీ హౌస్ వర్కర్ అయిన ఆయన 2017లో పార్టీ సభ్యుడయ్యారు. ఒడిషా నుండి కుటుంబాన్ని కేరళకు తీసుకొచ్చేయాలని అనుకుంటున్నాడు. ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ హయాంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు దీటుగా కేరళ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని తెలసుకుని ఇక్కడే తన కుమార్తెను చేర్చాలనుకుంటున్నాడు. ఇలా భావించే వారిలో జగన్నాథ్ ఒక్కరే కాదు, సిపిఎం కనలక్కర శాఖ సభ్యురాలు మౌసమి దాస్ లాంటి ఎంతోమంది ఉన్నారు. మౌసమి 15 ఏళ్ల క్రితం బెంగాల్ నుంచి పినరయి వచ్చేశారు. ఇక్కడే స్థలం కొనుక్కుని తన కుటుంబంతో సెటిలయ్యారు. ''ఇక్కడ చాలా సురక్షితంగా ఉంటున్నామనిపిస్తోంది. సాయం కావాలంటే పార్టీ కార్యకర్తలు ముందుకొస్తారు. మహిళలకు పార్టీ చాలా ప్రాధాన్యతనిస్తుందని'' ఆమె వ్యాఖ్యానించారు. 24 ఏళ్ల రవిసింగ్‌కు సిపిఎం పార్టీ మహాసభలు కొత్త. ఆయన కుటుంబం పదేళ్ల క్రితం యుపి నుంచి వచ్చేసింది. 18ఏళ్ల వయస్సుల్లో పార్టీ సభ్యుడైన రవిసింగ్ ఇప్పుడు డివైఎఫ్‌ఐ కార్యదర్శిగా ఉన్నాడు. జగన్నాథ్, మౌసమిదాస్, రవిసింగ్‌ల మాదిరిగా దాదాపు 25 లక్షలమంది ప్రజలు తమ సొంత రాష్ట్రాల నుంచి కేరళ వచ్చేశారు. వారు ఇక్కడ వలస కార్మికులుగా బతకడం లేదు, గెస్ట్ వర్కర్లుగా ఉన్నారు. సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ పనితీరుతో ప్రభావితమైన వీరు ఇక్కడివారితో అల్లుకుపోయారు. ఫలితంగా తమ సొంత రాష్ట్రాల్లో కులం, మతం, వర్గం, ప్రాంతం అంటూ వేర్వేరు కారణాలతో ఒంటరయ్యామన్న భావనను వీడి ఇక్కడ అందరితో కలిసి మెలిసి జీవిస్తున్నారు. గత ఆరేళ్లుగా ఈ గెస్ట్ వర్కర్లకు ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. వారిని కూడా ప్రధాన స్రవంతిలో కలిపేలా చర్యలు తీసుకుంటోంది. వారికోసం అప్నా ఘర్ పేరుతో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టింది.










