Dec 22,2021 08:28
  • మూడేళ్లుగా రూ. 50 కోట్లపైనే బకాయిలు
  • ఆర్‌ఆర్‌యాక్ట్‌ అమలు చేయని అధికారులు
  • ఆత్మహత్యలే శరణ్యమంటున్న కౌలురైతులు
  • ఫ్యాక్టరీ యజమాని ఇంటివద్ద నిరవధిక నిరసన

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : 'రెండువందల టన్నుల చెరకు ఫ్యాక్టరీకి తోలాను. లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇంకా మూడు లక్షల రూపాయలు రావాల్సి ఉంది. ఈ మూడు లక్షలకు ఇప్పటి వరకూ లక్షరూపాయలు వడ్డీ కట్టాను. మయూర ఫ్యాక్టరీకి చెరకు తోలి అప్పులపాలయ్యాను. బకాయిల కోసం తొమ్మిది రోజులుగా ఫ్యాక్టరీ యజమాని ఇంటి ముందే పడిగాపులు కాస్తున్నాను. బకాయిలు చెల్లిస్తే గానీ ఇంటికెళ్లను' అని చిత్తూరు జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన రైతు కృష్ణమూర్తి ఆవేదన.
    ' నేను కౌలురైతును. సెంటు భూమి లేదు. మా ఊళ్లో పది ఎకరాలు కౌలుకు తీసుకుని చెరకు పండించాను. పంట పండినా, పండకపోయినా ఎకరాకు పదివేల రూపాయలు కౌలు చెల్లించాలి. మూడేళ్ల కాలంలో అప్పుచేసి మూడు లక్షలు చెల్లించాను. 416 టన్నుల చెరకు ఫ్యాక్టరీకి తోలాను. ఆరు లక్షల బకాయి చెల్లించాలి. వడ్డీతో కలుపుకొని రూ.11 లక్షల పైనే అప్పు మిగిలింది. ఆత్మహత్యే శరణ్యం'. ఇది ఆర్‌సిపురం మండం గణేష్‌పురం గ్రామానికి చెందిన కౌలు రైతు ఆర్‌.బాబూనాయుడు మనోవేదన
    ఇది ఈ ఇద్దరి రైతుల ఆవేదనే కాదు మయూర ఫ్యాక్టరీకి చెరుకు తోలిన రైతుల మనోవేదన. ఫ్యాక్టరీకి చెరుకు తోలి మూడు సంవత్సరాలు కావస్తున్నా..నేటికి బకాయిలు చెల్లించలేదు. చిత్తూరు జిల్లా బిఎన్‌కండ్రిగ మండలం సుద్దలగుంట సమీపంలో మయూర సుగర్‌ ఫ్యాక్టరీ ఉంది. 15-17 లక్షల టన్నుల క్రషింగ్‌ సామర్ధ్యం ఉంది. దాదాపు 20 ఏళ్లపాటు ఈ ఫ్యాక్టరీకి చిత్తూరు, కడప, నెల్లూరు, సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడులోని కొన్ని ప్రాంతాల నుంచి చెరకును తోలేవారు. అయితే మూడేళ్లుగా 3,498 మంది రైతులకు బకాయిలు చెల్లించడం లేదు. మూడేళ్లకు సుమారు రూ.38 కోట్ల రూపాయల బకాయి పడింది. వడ్డీతో కలుపుకొని సుమారు రూ.50 కోట్లపైమాటే. వాస్తవంగా చెరకు తోలిన 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలనే నిబంధన ఉంది. బకాయిల కోసం చెరకు రైతులు యాజమాన్యానికి తొలుత అర్జీలిచ్చారు. శాంతియుత ఆందోళనలు చేపట్టారు. ఫ్యాక్టరీ ఆస్తులు వేలం వేసి తమ బకాయిలు చెల్లించాలని ఉన్నతాధికారులను కోరుతూ వచ్చారు. వీరి గోడు పట్టించుకోని యాజమాన్యం ఇక్కడ బోర్డు తిప్పేసి, ఫ్యాక్టరీ మూసేసి ఇతర రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. దీంతో రైతులు గత పది రోజులుగా తిరుపతిలోని ఫ్యాక్టరీ యజమాని జయరాం చౌదరి ఇంటిముందు నిరవధిక దీక్షకు దిగారు. పోలీసులు మాత్రం ఇంటి వద్ద ఆందోళన చేయడానికి వీల్లేదని రైతులపైనే నిర్బంధం ప్రయోగించడం ప్రారంభించారు. బకాయిలు తీసుకోకుండా ఇక్కడినుంచి కదిలేది లేదని రైతులు ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు.

                                       ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ఎందుకు ప్రయోగించలేదు

ఏదైనా ఇంట్లో దొంగతనం జరిగితే దొంగను పట్టుకోవడానికి ఫోన్‌ ట్యాప్‌ చేసి, ముమ్మర గాలింపు చర్యలు చేపడతారు. నాలుగువేల మందికి పైగా రైతులను మోసం చేసి రూ.50 కోట్లకు పైగా బకాయిలు చెల్లించని జయరాం చౌదరి పైన ఎందుకు ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ప్రయోగించలేదు. జయరాంచౌదరి ఆస్తులను జప్తు చేసి రైతులకు రావాల్సిన బకాయిలను చెల్లించే వరకూ ఆందోళన విరమించేది లేదు.
                                          - పి.హేమలత, రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు