Dec 11,2022 10:37

బుక్కరాయసముద్రంలో వానకు తడవకుండా వరిపంటపై పట్టలు కప్పుతున్న రైతులు

         అనంతపురం ప్రతినిధి : మాండూస్‌ తుఫాను ప్రభావం ఉమ్మడి అనంతపురం జిల్లాపై పడింది. శుక్రవారం రాత్రి నుంచే జిల్లాలో మబ్బులు కమ్ముకున్నాయి. ఇక శనివారం ఉదయం నుంచి ఏకధాటిగా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. ఎక్కడా భారీ వర్షాలు పడనప్పటికీ ఏకధాటిగా పడుతున్న వర్షాలతో చిత్తడి నెలకొంది. తుపాను తీరం దాటిన నేపథ్యంలో భారీ వర్షాలు పడే అవకశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికి జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. పుట్టపర్తిలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్టు అక్కడి జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కమార్‌ తెలిపారు.
తేలికపాటి వర్షాలే...
            శుక్రవారం రాత్రి నుంచే వర్షాలు మొదలైనప్పటికీ ఎక్కడా భారీ వర్షాలు పడలేదు. సత్యసాయి జిల్లాలో ఎన్‌పికుంటలో అత్యధికంగా 16.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, అమడగూరులో 14.8 మిల్లీమీటర్లు నమోదయింది. సత్యసాయి జిల్లా అంతటా చూసినప్పుడు సగటున 4.9 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది. అనంతపురం జిల్లా పరిధిలో యల్లనూరులో 8 మిల్లీమీటర్లు, నార్పలలో 6.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది. ఉదయం నుంచే ఆకాశం మేఘామృతమై మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. ఈదురుగాలులతోపాటు చిరుజల్లులు పడుతుండటంతో జనం బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఒకవైపు చలి మరోవైపు చిరుజల్లులు జనాలను వణికించాయి.
పంటలపై తీవ్ర ప్రభావం
          ఎడతెరిపిలేకుండా పడుతున్న చిరు జల్లుల ప్రభావం పంటలపై తీవ్రంగా ఉండే అవకాశముంది. గత నెలలో పడిన అధిక వర్షాలక ఇప్పటికే పెద్దఎత్తున పంటలకు తెగళ్లు వ్యాపించాయి. పత్తి పంట దిగుబడి పూర్తిగా దెబ్బతింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 2.10 లక్షల ఎకరాల్లో పత్తి పంట ఉంది. మొదటి కోత అయిపోయి రెండో కోత దశలో ఉన్న సమయంలో పడుతున్న సమయంలో ఈ వర్షాలకు తెగుళ్లు మరింత వ్యాపించే అవకాశముందని రైతుల ఆందోళన చెందుతున్నారు. ఇక 70 వేల ఎకరాల్లో వేసిన మిరప పంటది ఇదే పరిస్థితి. నల్లతామర తెగుళ్లు ఇప్పటికే పంట దిగుబడులపై ప్రభావం చూపింది. ఇప్పుడు మరిన్ని తెగుళ్లు వ్యాపిస్తే పంట చేతికొచ్చింది పోయే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానవన పంటల్లో ప్రధాన పంట అయిన అరటికి సిగటోమా తెగుళ్లు ఈ వాతావరణంలో అధికమై చేతికొచ్చిన పంట రైతుకు దక్కకుండాపోయే అవకాశాలున్నాయి. ఇప్పటికే తోటల్లో సిగటోమా లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఈ వర్షాలకు మరింత నష్టం జరుగనుందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి : సత్యసాయి జిల్లా కలెక్టర్‌
           మాండూస్‌ తుఫాను తీరం దాటిన సమయంలో వర్షాలు అధికంగా పడే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సత్యసాయి జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. జిల్లాలో రెండు రోజుల పాటు అధిక వర్షాలొస్తాయని వాతావరణ శాఖ సూచించిందని తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా పుట్టపర్తి కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఏదైనా ఇబ్బంది ఉంటే 08555292432, 9154968578 నంబరుకు ఫోన్‌ చేసి సమాచారమివ్వాలని తెలిపారు.
తడిసి ముద్దవుతున్న ధాన్యం
             బొమ్మనహాల్‌ :
తుంగభద్ర ఆయకట్టు కింద పంటలు కోసి కుప్పవేసిన వరి, మొక్కజొన్న ధాన్యం కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని సగం మంది రైతులు వరి, మొక్కజొన్న పంటలు కోత కోశారు. వాటిని కుప్పగా పోశారు. వర్షాలకు అవి తడిసి ముద్దవుతున్నాయి. కోతకోయని పంటలు వర్షాలకు పొలాల్లో నేలవాలాయి. పంట చేతికొచ్చే సమయంలో నోటికి అందకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఎపి రైతు సంఘం, సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు.
           బుక్కరాయసముద్రం : తుఫానుతో కురుస్తున్న వార్షాలకు మండలంలో దాదాపు 300 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి శివారెడ్డి తెలిపారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. పంటచేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాల వల్ల వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయని రైతులు వాపోతున్నారు.
వర్షాలతో మల్బరీకి నష్టం
            లేపాక్షి : తుపానుతో కురుస్తున్న వర్షాలతో మండల పరిధిలోని మామిడిమాకులపల్లి గ్రామంలో మల్బరీకి తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు నంజిరెడ్డి, రాఘవేంద్రరెడ్డిలు సాగు చేసిన 80 చంద్రికలకు తడి తగిలి గూళ్లను అల్లలేదు. దీంతో దాదాపు రూ.70 వేల నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంట నాశనం అయ్యిందన్నారు.
అకాల వర్షం రైతుకు నష్టం
     చెన్నేకొత్తపల్లి:అకాల వర్షాలతో చెన్నేకొత్తపల్లి మండలం ద్యామాజుపల్లి గ్రామంలో యువ రైతు అనంతరెడ్డి కాకర పంట మొత్తం నీటమునిగింది. అనంతరెడ్డి రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని అందులో కాకర పంటను సాగు చేశాడు. తుపాన్‌ ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పంట మొత్తం నీటి మునిగింది. పంట సాగునిమిత్తం రైతు రూ.2 లక్షలు అప్పుచేసి ఆధునిక పద్ధతిలో కాకర కట్టి కట్టి సాగు చేసేడు. కోత దశలో ఉండగా ప్రస్తుతం పడిన వర్షంతో పంట మొత్తం చేతికందకుండా పోయింది. వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి తనకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశాడు.