Jan 14,2023 20:06

ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న నాయకులు

పజాశక్తి-కలికిరి: ముస్లిం మైనార్టీలపై వేధింపులే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందని ముస్లిం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పుంగునూరు నియోజకవర్గంలో రెండు రోజుల క్రితం ముస్లిం మైనార్టీ నాయకుల అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం పట్ల కలికిరిలో ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక అమర్నాథ్‌రెడ్డి భవనంలో టిడిపి మండల అధ్యక్షుడు నిజాముద్దీన్‌, ముస్లిం మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనీఫ్‌ ఆధ్వర్యంలో అరెస్టయిన బాధితుల ఫోటోలు చేత పట్టుకొని తన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలు గత ఎన్నికల్లో ఓట్లు వేసినందుకే వైసిపి అధికారంలోకి వచ్చిందని దాన్ని మరచి ఇప్పుడు మైనార్టీలపై వేధింపులే లక్ష్యంగా అక్రమంగా కేసులు బనాయించి అరెస్టులు చేస్తుందని, ఇలాంటివి మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మైనార్టీల అభివృద్ధి చేయడానికి చేతగాక వారిపై దాడులకు దిగుతుందని కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నదని విమర్శించారు. మంత్రి నియోజకవర్గంలో ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు జరగడం పట్ల రాష్ట్ర ప్రజలంతా విసుగుపోతున్నారని పేర్కొన్నారు. దౌర్జన్య కాండను ప్రదర్శిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు. అక్రమంగా అరెస్టు చేసిన ముస్లిం మైనార్టీ నాయకులను విడుదల చేయకపోతే సబ్‌ జైలు ఎదురుగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై పోరును ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గుండ్లూర్‌ సర్పంచ్‌ సైఫుల్ల, తెలుగుదేశం నాయకులు ముస్తఫా హజరత్‌, సనావుల్లా, సిరాజ్‌, మాజీ జెడ్పిటిసి మాలతి, భాస్కర్‌ రెడ్డి, వైజాగ్‌ భాష, జావీద్‌ సుభహాన్‌, జాకీర్‌, ఖాదరవల్లి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.