హిందూపురం : రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని వైసిపి పురం ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ విమర్శించారు. శనివారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పొన్నూరులో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మైనార్టీ సదస్సులో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు మంత్రిమండలి లో ప్రాధాన్యత కల్పిస్తా, నామినేట్ పదవుల్లో అవకాశం కల్పిస్తా అని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముస్లిములకు ఏమి చేశారో చెప్పాలన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీ మంత్రిగా పల్లె రఘునాథరెడ్డికి ఇచ్చినప్పుడు మైనార్టీలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలను ముస్లిములు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలోని వైసిపి ప్రభుత్వం ముస్లిములకు అన్ని విధాలా న్యాయం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉర్దూను ద్వితీయ భాషగా వైసిపి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ముస్లిం సబ్‌ప్లాన్ కోసం అసెంబ్లీలో చట్టం చేసిన మొదటి ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. హజ్‌యాత్రకులకు రూ.30 నుంచి రూ.60 వేలు, ఇమామ్, మౌజన్లకు రూ. 5 నుండి 10 వేల చొప్పున గౌరవేతనం ఇస్తున్న జగన్ ప్రభుత్వనికే దక్కుతుందన్నారు. ముస్లింల పెన్షన్ల కోసం రెండు వేల కోట్ల రూపాయలను వైసిపి ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులన్నింటినీ ప్రభుత్వం పరిరక్షిస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ముస్లిం మైనార్టీ ప్రజలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో 175 స్థానాలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మరోమారు ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపడతారన్నారు.










