Sep 24,2023 21:49

ఫొటో : మాట్లాడుతున్న కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు

ముస్లిముల ద్రోహి జగన్‌మోహన్‌ రెడ్డి
ప్రజాశక్తి-కావలి : ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ముస్లిముల ద్రోహి అని, గత చంద్రబాబు ప్రభుత్వం ముస్లిములకు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలనాన్నింటినీ రద్దు చేసి, ముస్లిములకు తీరని ద్రోహం చేశారని టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు విమర్శించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా, కావలి నియోజకవర్గ టిడిపి కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయిలోని ముస్లిం మైనారిటీ నేతలు, మైనారిటీ విభాగం సభ్యులు, టిడిపి కుటుంబ సభ్యులతో ఆదివారం 11వ రోజు రిలే నిరాహార దీక్షలు అయన ఆధ్వర్యంలో నిర్వహించారు.
మైనారిటీ మహిళలు ''జగన్‌ హఠావో - చంద్రబాబు బచావో'' అంటూ దీక్షలో పాల్గొన్న ముస్లిం మైనారిటీ మహిళలు మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ముస్లిములకు ఏమి చేశారంటూ ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వంలో వచ్చే దులహన్‌ పథకం, రంజాన్‌ తోఫా, దుకాన్‌ మకాన్‌ వంటి పథకాలను రద్దు చేసి అన్యాయం చేశారని, రాబోయే ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ ఓటర్లు అందరూ టిడిపి వైపే ఉంటారని స్పష్టం చేశారు. దీక్ష ముగింపు సందర్భంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ మహిళ దీక్షకు అధిక సంఖ్యలో తరలివచ్చిన మైనారిటీ సోదరి, సోదరమణులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డిని ఇంటికి తరిమికొట్టే బాధ్యత ప్రజలందరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు.