ఆ రోజు అందరు పిల్లలు బడికి వెళ్లి ప్రాంగణంలో ఆడుకుంటున్నారు. మురళి వారిని చూసి చాలా బాధపడ్డాడు. గతేడాది ఇదే సమయానికి అతనూ చదువుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు తన భుజానికి ఒక పెద్ద సంచి ఉంది. కానీ అది స్కూలు బ్యాగ్ కాదు, అందులో పుస్తకాలు లేవు. దానిలో రోజంతా ఆకలి తీర్చే సామాను ఉంది. కోడికూతకు ముందే మేలుకొని బతుకు భారాన్ని మోయడం కోసం మురళి బయల్దేరతాడు. ఉదయాన్నే ప్రతి కుండీలో ఉన్న చెత్తను అపురూపంగా తీసుకొని, తన భుజాన ఉన్న సంచిలో వేసుకుంటాడు. పారిశుధ్య కార్మికునికి ఏమాత్రం తీసిపోడు.
సీసాలు, కాగితాలు, పాల ప్యాకెట్లు, ఇనుప ముక్కలు, వాటర్ బాటిల్ అన్నింటినీ అపురూపంగా చూస్తాడు. దొరికిన వస్తువులన్నింటినీ పాత ఇనుప సామాను కొనే సాంబయ్య దగ్గరికి తీసుకెళ్లి అమ్మేస్తాడు. వచ్చిన డబ్బును అమ్మకి ఇస్తాడు. దానితో ఆ పూట ఆమె కాసింత అంబలి కాసిపెడుతుంది. అదే సమయానికి అయ్య బాగా తాగి వచ్చి అమ్మతోపాటు మురళినీ చావుదెబ్బలు కొడతాడు.
'నాన్న నన్ను ఎందుకు కొడుతున్నావ్?' అని నిలదీస్తే మరిన్ని దెబ్బలు పడతాయి. తాగే కాస్త అంబలి ఆడ పడేసి, మళ్ళీ దు:ఖంతో భుజాన సంచి వేసుకుని వెళ్ళిపోతాడు మురళి. ఇదంతా చూస్తూ ఏమీ అనలేక వెక్కివెక్కి ఏడుస్తుంది మురళి వాళ్ళమ్మ వెంకటమ్మ. కళ్ళ ముందే కొడుకు జీవితం మంచులా కరిగిపోతుంటే కొడుకుని ఆపలేక, భర్తనీ నివారించలేక ఏమి చేయలేని స్థితిలో ఉండి పోయిన అభాగ్యురాలు ఆమె. మురళికి బాల్యం నుండి సాహసం ఎక్కువ. తన గురువు మాటల్ని బాగా వొంట పట్టించుకున్నాడు. ఎలాగైనా తన తండ్రిని తాగుడు మాన్పించాలనుకున్నాడు. కానీ తన వయస్సుకు మించిన పని.. కానీ తప్పదు. ''ధైర్యే సాహసే లక్ష్మీ'' అన్న తన గురువు గారి మాటలు గుర్తొచ్చాయి.
ఒకరోజు భుజాన సంచి వేసుకొని పొద్దున్నే బయలుదేరాడు మురళి. ఎలాగైనా రంగయ్య సారా కొట్టు మూయించాలి అనుకున్నాడు. పాత ఇనుప సామాను అమ్మిన డబ్బులతో సారా కొనుక్కున్నాడు. సారా తాగుతున్నట్లు నటించసాగాడు. చిన్నపిల్లవాడు సారా తాగడం చూసిన ఒక వ్యక్తి 100 నెంబర్కు ఫోన్ చేశాడు. ఐదు నిమిషాలలో పోలీసులు అక్కడకు వచ్చారు. చిన్నపిల్లలకు మద్యం అమ్మడం చట్ట విరుద్ధమని, ఆ సారాకొట్టు యజమానిపై మద్యపాన నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. దానితో ఆ ఊరిలో సారాకొట్టు లేకుండా పోయింది. అప్పటి నుండి మురళీ నాన్న తాగడం మానేశాడు. తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. మునుపటిలా కొడుకుని బడికి పంపాడు. మురళి చేసిన సాహసం తెలిసి ఊరంతా ఎంతో సంతోషించారు.
- నాగరాజు మద్దెల
6301993211