ప్రజాశక్తి-కంచికచర్ల: కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయ ఆవరణ చిన్నపాటి చెరువును తలిపిస్తుంది. ఈ కార్యాలయ ఆవరణలోనే తహశీల్దార్, ఆర్‌డబ్య్లూఎస్, మండల మహిళా సమాఖ్య, ఉపాధి హామీ, హౌసింగ్, కెడిసీసీ బ్రాంచ్, ఎంఈవో కార్యాలయం, సబ్ ట్రెజరీ, 108 కార్యాలయం, గ్రామ సచివాలయం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతిరోజు ఆయా శాఖల అధికారులతోపాటు, సిబ్బంది, వివిధ పనుల నిమిత్తం మండలంలోని 16 గ్రామాల నుంచి రెండు వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తుంటారు. వారంలో రెండు మూడు సార్లు ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు వస్తుంటారు. అయితే మండల పరిషత్ కార్యాలయ ఆవరణతో పాటు ఆయా ప్రభుత్వ కార్యాలయల చుట్టూ పెద్ద గోతులు ఏర్పాడి ఏ చిన్నపాటి వర్షం వచ్చినా వర్షం నీరు బయటకు పోయే మార్గం లేక ఆయా కార్యాలయాల చుట్టు నిల్వ చేరుతున్నాయి. రోజులు తరబడి వర్షపు నీరు నిల్వ చేరటం వల్ల మురుగు ఏర్పాడుతుంది. 65వ నెంబరు జాతీయ రహదారి నుంచి మండల పరిషత్ కార్యాలయ ఆవరణ గుండా ఆయా కార్యాలయలకు వెళ్లే దారి కూడా గోతులమాయంగా మారి వర్షపు నీరు నిల్వ చేరుతుంది. ఆయా కార్యాలయాలకు ద్విచక్రవాహనాలు రావటానికి ఇబ్బందిగా మారింది. నీటి గుంత లోతు తెలియక కార్యాలయ ఆవరణలోనే ద్విచక్రవాహనాలు అదుపుతప్పి అనేక మంది కిందపడిన సంఘటనలు ఉన్నాయి. అలాగే పాదచారులు సైతం నీటి గుంతల్లోనే ఇబ్బందులు పడుతూ నడుస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయం పక్కన 108 కార్యాలయం ముందు వర్షం నీరు రోజులు తరబడి నిల్వ చేరి రంగు మారి దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో కార్యాలయ ఆవరణలోకి వచ్చేవారు ముక్కు మూసుకొని రావాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రజలు అంటున్నారు. అలాగే మండల పరిషత్ కార్యాలయంతో పాటు వివిధ శాఖాల కార్యాలయం చుట్టు మురుగు నీరు చేరటం వల్ల చిన్నపాటి చెరువుల తలపిస్తు పగటిపూటే దోమలు సైర్వవిహారం చేస్తున్నాయి.
కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయంతో పాటు ఆవరణ పరిసరాల్లో గల అధికారులు ప్రజాప్రతినిధుల చాంబర్లు కార్పొరేట్ ఆఫీసులను తలపిస్తున్నాయి. అధికారులు ఛాంబర్లలో ఎసితో పాటు అధునాతన సీలింగ్ ఖరీదైన ఫర్నిచర్, టైల్సు ఏర్పాటు చేసుకొని విలాసంగా గడుపుతున్నారని, అయితే కార్యాలయ ఆవరణ చుట్టూ గుంతలు ఏర్పడి వర్షం నీరు నిల్వ చేరి మురుగు కూపంగా ఉన్నపటికి పట్టించుకోవటంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఐదు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ డిల్లీరావు కంచికచర్ల తహశీల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫ్‌రెన్స్‌కు వచ్చారు. అప్పటికే కార్యాలయ ఆవరణలో గోతుల్లో వర్షపు నీరు నిల్వ చేరి మురుగు కూపంగా ఉంది. కలెక్టర్ కారు రావటానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇది గమణించిన అధికారులు కలెక్టర్ తిరిగి వెళ్లే సమయానికి పంచాయితీ పారుశుధ్య సిబ్బంది చేత హడావుడిగా తాత్కాలికంగా గోతులు పూడ్చారు. అయితే వర్షం నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. కంచికచర్ల మండల పరిషత్ నిధుల నుంచి ప్రతి ఏటా ఆయా గ్రామాల అభివృద్ధికి కేటాయిస్తున్న విషయం తెలిసిందే... మండల పరిషత్ నిధులతో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల ఆయా శాఖాల కార్యాలయ ఆవరణ చుట్టూ అభివృధ్ది చేయటంతో పాటు గ్రీనరీని ఏర్పాటు చేసి ఆహ్లాదకారంగా ఉండేలా చేయాలని, ప్రజలు సిబ్బంది కోరుతున్నారు.










