మడకశిర : మడకశిర నగర పంచాయతీ కార్యాలయంలో శనివారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం సభ్యుల వాదనలు, ప్రతివాదనల నడుమ వాడీవేడిగా కొనసాగింది. గెలుపొందిన కౌన్సిలర్లే సమావేశంలో పాల్గొనాలని అధికారులు పేర్కొన్నారు. దీనిపై పెద్ద ఎత్తున వాదనలు జరిగాయి. ప్రభుత్వ జీవో మేరకు దీనిని తప్పని సరిగా అమలు చేయాల్సిందేనని కమిషనర్ చెప్పడంతో ప్రజాప్రతినిధుల స్థానంలో వచ్చిన వారి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. ఇలా మడకశిర మున్సిపల్ పాలక వర్గం అసలైన కౌన్సిలర్లతో తొలిసారి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో అధికారులు మందుగా అజెండాల్లో పేర్కొన్న వివరాలు వెల్లడించే ప్రయత్నం చేశారు. ఈ లోపుగానే ప్రతిపక్ష టిడిపికి చెందిన ఐదు మంది కౌన్సిలర్లు పాలకవర్గం, అధికారులపై ఏకధాటిగా ప్రశ్నల వర్షం కురిపించారు. వీరు మాట్లాడుతుండగానే అధికార పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో నగర పంచాయతీ వైస్ ఛైర్మన్ రామచంద్ర రెడ్డి జోక్యం చేసుకుని సమస్యలను కౌన్సిల్ సభ్యులే మాత్రమే వివరించాలని, ఇతరులకు సమావేశంలో మాట్లాడే హక్కు ఉండదని పేర్కొన్నారు. దీనిపై మహిళా సభ్యులు స్పందిస్తూ తమకు రాజకీయ, వార్డుల అభివృద్ధిపై అవగాహన తక్కువగా లేని నేపథ్యంలో తమ భర్తల సహకారంతో సమావేశాలకు హాజరవుతున్నామని చెప్పారు. తాము పదవులు చేపట్టి రెండు సంవత్సరాలు అవుతోందని అప్పట్లో ఇలాంటి నిబంధనలు లేవని, ఇప్పుడు మాత్రమే ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ లక్ష్మీనరసమ్మ కాగా ఆమె తనయుడు ఇంత వరకు కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహించారని, ఆప్పుడు అధికారులు ఎందుకు ఆయన్ను నిలువరించలేదన్నారు. ఈ విషయంపై కమిషనర్ ప్రభాకర్‌రావు జోక్యం చేసుకుని ప్రభుత్వం కొత్తగా జీవోను విడుదల చేసిందని, ఆ మేరకు ప్రస్తుతం దీనిని అమలు చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. నిబంధనలు అమలు చేస్తామని చెప్పడంతో కౌన్సిలర్ల స్థానంలో సమావేశానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులు సమావేశం మందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. భవిష్యత్తులో జరిగే సమావేశాల్లో కూడా ఛైర్‌పర్సన్ స్థానంలో లక్ష్మీనరసమ్మ మాత్రమే ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం పలువురు సభ్యులు మాట్లాడుతూ హిందూపురం రోడ్డులో అనుమతులు లేకుండా అనధికారికంగా అనుమతులు లేకుండా వెలసిన ప్రయివేటు పాల శీతలీకరణ కేంద్రంపై అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. నగర పంచాయతీలో నిబంధనల సాకుతో నూతనంగా నిర్మించే ఇళ్ల నిర్మాణాలకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. వడ్రపాలెం గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రవంగా ఉందని దీనిని పరిష్కరించాలని పలుసార్లు అధికారుల దష్టికి తీసుకొచ్చిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కౌన్సిలర్లుగా తాము గెలిచినా వార్డుల్లో ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతున్నామని పేర్కొన్నారు. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి దాదాపు మూడు నెలలు కావస్తున్న ఇప్పటి వరకు ఒక్క వార్డులో కూడా పర్యటించలేదని, ఇలా ఉంటే సమస్యలు ఎలా తెలుస్తాయన్నారు. ఇలా అధికారులపై సభ్యులపై ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమే సమావేశాన్ని ముగించేశారు. ఈ సమావేశంలో వైస్ ఛైర్మన్ వెంకటలక్ష్మమ్మ, రామచంద్ర రెడ్డి, కోఆప్షన్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.










