కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న నాయకులు
మున్సిపల్ కార్మికులకు ముఖహాజరు మినహాయింపు ఇవ్వాలి
-కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా
నెల్లూరు:రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 'ఫేస్ యాప్' (ముఖ హాజరు) విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ మున్సిపల్ కార్మికులు కార్పోరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఏపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ (సిఐటియు అనుభందం) యూనియన్ ఆధ్వర్యంలో బారాషాహిద్ దర్గా నుంచి కార్పోరేషన్ కార్యాలయం వరకు మున్సిపల్ వర్కర్స్ ర్యాలీ నిర్వహించి అనంతరం కార్పోరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.పెంచలనర్సయ్య, సిఐటియు నాయకులు జి.నాగేశ్వరరావు, కిన్నెరకుమార్ తదితరులు ముఖ్యఅతిధులుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫేస్ యాప్ నుంచి మున్సిపల్ కార్మికులను మినహాయింపు ఇవ్వాలని, క్లాప్ వెహికల్స్ డ్రైవర్స్ కి బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఫేస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని హాజరు వేసుకోవాలని సూచించడం దారుణమన్నారు. వాస్తవానికి మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్న వారిలో అత్యధికులు నిరక్షరాస్యులు, స్మార్ట్ ఫోన్ వాడే విధానం తెలియనటువంటివారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. ఇప్పటికే సచివాలయ సెక్రటరీలు, శానిటరీ ఇన్స్పెక్టర్సు ముఖ హాజరు తీస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ కార్మికులనే ముఖ హాజరు తీసుకొని హాజరు వేసుకోవాలని చెప్పడం వలన రోజు వారి పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. 54 డివిజన్లో పరిధిలో ఐదు పాయింట్స్ ఇచ్చి అక్కడ మున్సిపల్ కార్మికులు ముఖ హాజరు తీసుకోవాలంటే వ్యయ, ప్రయాసలతో కూడుకున్నదన్నారు. మున్సిపల్ కార్మికులు చాలీ చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న సమయంలో ముఖ హాజరు కోసం అధికారులు నిర్ధేశించిన పాయింట్ వద్దకు వచ్చి ఫోటో తీసుకొని అప్‌లోడ్ చేసి తిరిగి తమ పనులు నిర్వహించాల్సిన ప్రాంతానికి చేరుకోవాలంటే కష్టంతో కూడుకున్న విషయమన్నారు. మున్సిపల్ కార్మికుల ఆర్థిక పరిస్థితిని ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికులను ముఖ హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా క్లాప్ వెహికల్ డ్రైవర్స్ సంబంధించి నాలుగు నెలల జీతాలు బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. సమయానికి విధులకు హాజరు కాలేదన్న కుంటి సాకు చూపి జీతాలలో కోత విధించి పీఎఫ్ ఈఎస్‌ఐ కార్మికుల ఖాతాలో జమ చేయడం లేదని వాపోయారు. ప్రస్తుతం కార్పోరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో చెత్త తరలించేందుకు రెడ్డి ఏజెన్సీ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని కొన్ని వాహనాలతో చెత్త తరలిస్తుందన్నారు. అయితే కార్పొరేషన్ నుండి రెడ్డి ఏజెన్సీకి బిల్లులు చెల్లించక పోవడంతో ఆ క్లాప్ వెహికల్స్‌ను తీసుకెళ్లేందుకు రెడ్డి ఏజన్సీ ప్రకటించిందన్నారు. వాస్తవానికి అదే జరిగితే దాదాపు 50 మంది డ్రైవర్లు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ డ్రైవర్లను కార్పొరేషన్ డ్రైవర్లుగా కొనసాగే విధంగా చర్యలు తీసుకుని, బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ కు సమస్యలను వివరించి మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్ అధ్యక్షులు కొండ ప్రసాద్, సిఐటియు నాయకులు సంపత్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కామాక్షమ్మ, దేశ మూర్తి, అశోక్, సుజాతమ్మ, చెన్నయ్య, శ్రీనివాసులు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.










