Apr 12,2023 21:57

మానవహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు

పుట్టపర్తి అర్బన్‌ : మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిఐటియు ఉద్యోగ, కార్మిక, సంఘం జిల్లా కార్యదర్శి ఎన్‌ లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కార్మికులు బుధవారం స్థానిక హనుమాన్‌ టెంపుల్‌ సర్కిల్‌ లో మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులుగా పారిశుధ్య కార్మికులు విధులకు హాజరు కానందున పట్టణంలో పారిశుధ్యం లోపించిందన్నారు. ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతోందన్నారు. దీనికి తోడు డ్రైనేజీ కార్మికులు ఇంజనీరింగ్‌ కార్మికులు సైతం సమ్మెకు సిద్ధమవుతున్నారన్నారు. వీధిలైట్లు, డ్రైనేజీ, త్రాగునీరు సరఫరా ఇవన్నీ ఆగిపోతాయని హెచ్చరించారు. మూడు నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని, 8 నెలల పిఎఫ్‌ సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పలుమార్లు అధికారుల, పాలకుల దృష్టికి తెచ్చిన పట్టించుకోలేదన్నారు. కార్మికుల నిరసనకు వివిధ రాజకీయ పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పైపల్లి గంగాద్రి, టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, జనసేన నాయకులు తిరుపతేంద్ర, అబ్దుల్‌ అబు, టిఎన్‌టియుసి నాయకులు రామాంజి, పాపారెడ్డి, కొండకమర్ల రాము, నాయకులు జ్యోతి ప్రసాద్‌, ఆంజనేయులు, గోవిందు, పెద్దన్న, నాగార్జున, నరసింహులు, నరసింహ, రమణ తదితరులు పాల్గొన్నారు.