Jul 08,2022 22:34

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: ఏళ్ల తరబడి పనిచేస్తున్న మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలని సిఐటియు పశ్చిమ సిటీ కార్యదర్శి బోయి సత్యబాబు డిమాండ్‌ చేశారు. విజయవాడ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల గేట్‌ మీటింగ్‌ వన్‌టౌన్‌ చిట్టూరి కాంప్లెక్స్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జీతాలు తగ్గించి పనిభారం పెంచి కార్మికులను అన్యాయం చేస్తుందని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కార్మికులకు పర్మినెంట్‌ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పిన హామీలు నాలుగో సంవత్సరం అవుతున్న ఏ ఒక్కటీ అమలు చేయకుండా మోసగించారని తెలిపారు. హెల్త్‌ అలవెన్స్‌ పేరుతో రూ.6 వేలు గత ఆరు నెలలుగా ఇవ్వకుండా కార్మికుల్ని కష్టాలు పాలు చేస్తుందని అన్నారు. ఆప్కాస్‌ పేరు చెప్పి 60 ఏళ్లు నిండిన కార్మికుల్ని తొలగించి వారికి ఎటువంటి సర్వీసు పెన్షన్‌ సదుపాయం ఇవ్వకుండా వారి పిల్లలకి ఉద్యోగం కల్పించకుండా తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. పర్మినెంట్‌ కార్మికుల సరెండర్‌ లీవ్‌ బకాయిలు, హెల్త్‌ కార్డులు, జిపిఎఫ్‌ అకౌంట్లు విడుదల చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈ నెల 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేయక తప్పడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఉయ్యాలకొండ వెంకటేశ్వరరావు, సుబ్బారావు, రవణమ్మ, శ్రీను, కొండ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 11వ తేదీన కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే మహా ధర్నాలో ప్రతిఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని బోయి సత్యబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం తారాపేట సెంటర్లో ముఠా కార్మికుల యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఠా కార్మికులపై ప్రభుత్వాల భారీ పెనాల్టీలు నిలుపుదల చేయాలని, కార్మికుల సాంప్రదాయ కూలీ కాపాడాలని, ముఠా కార్మికులకు ప్రభుత్వం ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నగర అధ్యక్షులు జి.వెంకట్రావు, ముఠా కార్మిక సంఘం ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఇ.వి.నారాయణ, యూనియన్‌ నాయకులు బసిరెడ్డి రమణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.