Mar 15,2023 22:02

కరపత్రాలు విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 17న చలో కలెక్టరేట్‌ కార్యక్రమం చేపట్టినట్లు మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో పట్టణంలోని మునిసిపాలిటీ కార్యాలయం ముందు చలో కలెక్టరేట్‌ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునిసిపాలిటీలోని పనిచేస్తున్న పారిశుధ్య, ఇంజనీరింగ్‌, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్‌ కార్డులు, రిస్క్‌ అలవెన్స్‌, చదువుకున్న వారికి ప్రమోషన్లు తదితర సమస్యలను ప్రస్తుత శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లోనే చర్చించి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి గౌస్‌ లాజం, యూనియన్‌ నాయకులు గోవిందు, పెద్దన్న, నాగార్జున, రామయ్య ఇంజనీరింగ్‌ యూనియన్‌ నాయకులు రమణ, రమేష్‌, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.