Mar 17,2023 22:20

కలెక్టరేట్‌ ముందు ఆందోళన చేస్తున్న కార్మికులు, నాయకులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య, ఇంజనీరింగ్‌, క్యాప్‌ డ్రైవర్ల అండర్‌ డ్రైనేజీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని సిఐటియు, మున్సిపల్‌ కార్మిక సంఘం నాయకులు హెచ్చరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు శుక్రవారం పుట్టపర్తి ఆర్టీసీ డిపో నుంచి జిల్లా కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా చేరుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ గేట్‌ ముందు బైటాయించి నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌, మున్సిపల్‌ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు ఉద్యోగ భద్రత లేదన్నారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెండింగ్‌ లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ లో ఉన్న ఐదు నెలల పిఎఫ్‌ చెల్లించాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ లు, రిస్క్‌ అలవెన్స్‌ లు ఇవ్వాలని కోరారు. పేస్‌ యాప్‌ విధానాన్ని రద్దు చేయాలని, మృతి చెందిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌ చేతన్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, మండల కార్యదర్శి గౌస్‌ లాజాం, కార్మిక సంఘం నాయకులు గోవిందు, పెద్దన్న, రామయ్య, నరసింహులు, నాగార్జున, గంగాధర్‌ పాల్గొన్నారు.