రైతు సంఘాలు డిసెంబరు 8న భారత్ బంద్ జరపమని ఇచ్చిన పిలుపు దిగ్విజయంగా అమలు జరిగింది. రైతుల ఉద్యమానికి, వారి డిమాండ్లకు ప్రజలు పూర్తిగా అండగా నిలిచారని ఇది స్పష్టం చేస్తోంది.
పలు చోట్ల బంద్ పిలుపుకు ప్రజలు తమంతట తాముగా స్పందించారు. చాలా విస్తృత స్థాయిలో సమాజంలోని వివిధ తరగతుల ప్రజలు బంద్‌కు మద్దతు తెలిపారు. కార్మిక సంఘాలు, వర్తక సంఘాలు, ట్రాన్స్‌పోర్ట్ సంఘాలు, ఉపాధ్యాయ, విద్యార్ధి, మహిళా సంఘాలు, పలు ఇతర సంస్థలు బంద్‌లో పాల్గొన్నాయి. రైతుల విషయంలో మోడీ ప్రభుత్వం ఏకాకి అయిందన్న విషయాన్ని ఇవన్నీ సూచిస్తున్నాయి. దాదాపుగా అన్ని బిజెపి యేతర ప్రతిపక్ష పార్టీలూ ఈ ఉద్యమానికి తమ మద్దతు తెలియజేయడం గమనార్హం. ఇంతవరకూ కేంద్రంలో బిజెపి తీసుకున్న ఏ విధానపరమైన చర్యనూ స్పష్టంగా వ్యతిరేకించడానికి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ముందుకు రాలేదు. కాని ఈ సందర్భంలో మాత్రం అవి తీసుకున్న వైఖరి ప్రత్యేకంగా మనం గమనించాలి. తెలంగాణ లోని టిఆర్‌ఎస్ బంద్‌ను జయప్రదం చేయడానికి చురుకుగా పని చేసింది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్‌ఆర్ సిపి ప్రభుత్వం రైతుల మనోభావాలను గౌరవిస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, విద్యా సంస్థలను, ప్రజా రవాణాను మధ్యాహ్నం ఒంటి గంట వరకూ బంద్ చేసింది. ఒడిశాలో కూడా బిజెడి బంద్ పిలుపుకు మద్దతు ప్రకటించలేదు కాని రైతాంగం డిమాండ్లను బలపర్చింది. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి.
వివిధ రాజకీయ శక్తుల నుండి విస్తృతంగా అందిన మద్దతు వెనుక వర్గ విభజన స్పష్టంగా ఉంది. కార్పొరేట్లకు అనుకూలంగా చేసిన వ్యవసాయ చట్టాలు ఒకవైపున బడా బూర్జువా వర్గానికీ, ఇంకొక వైపున ధనిక రైతులతో సహా యావత్తు రైతాంగానికీ మధ్య ఘర్షణకు కారణమయ్యాయి. పెట్టుబడిదారీ భూస్వాముల మధ్య కూడా ఒక చీలిక ఏర్పడింది. అందుకే దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలూ మూకుమ్మడిగా రైతులకు మద్దతునిచ్చాయి.
రైతాంగానికీ, కార్మిక వర్గానికీ ఉండే ప్రయోజనాలు ఏకోన్ముఖంగా సాగుతున్నాయన్నది వర్గ పరంగా చూసినప్పుడు కనిపించే రెండవ ముఖ్యమైన అంశం. గత పార్లమెంటు సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను, మూడు కార్మిక కోడ్‌లను మోడీ ప్రభుత్వం వెంటవెంటనే, హడివుడిగా ఆమోదింపజేసుకున్న తీరు ఆ ప్రభుత్వం ఎంత నగంగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందో కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఈ జంట దాడులకు వ్యతిరేకంగా పోరాటంలో కార్మికులూ, రైతులూ ఐక్యంగా కదులుతున్నారు.
ఈ ఏడాది జూన్ నెలలో తొలుతగా ఆర్డినెన్సుల రూపంలో వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం జారీ చేసింది. ఆ తర్వాత సెప్టెంబరులో బిల్లుల రూపంలో వీటిని పార్లమెంటులో ప్రవేశ పెట్టింది. అన్ని పార్లమెంటు సాంప్రదాయాలనూ బేఖాతరు చేస్తూ వాటికి ఆమోద ముద్ర వేయించుకుంది. ఆర్డినెన్సులు జారీ చేసినప్పుడే ప్రభుత్వం తన ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెప్పింది. నిత్యావసర సరుకుల చట్టానికి సవరణలు తెచ్చి వ్యవసాయ ఉత్పత్తులనన్నింటినీ నిత్యావసర సరుకుల జాబితా నుండి తొలగించింది. ఆ సందర్భంగా ''ఈ విధంగా ఉత్పత్తి చేయడానికి, నిల్వ చేయడానికి, తరలించడానికి, సరఫరా చేయడానికి కల్పించిన స్వేచ్ఛ వలన ఆర్థిక కార్యకలాపాల స్థాయి పెరిగి ప్రైవేటు రంగం నుంచి, విదేశాల నుంచి ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి తోడ్పడుతుంది'' అని ఆ సందర్భంగా ప్రకటించింది.
మొత్తంగా ఈ మూడు చట్టాలూ కలిసి మన వ్యవసాయ మార్కెట్లపై ఎటువంటి నియంత్రణా లేకుండా చేస్తాయి. మార్కెట్లపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి అదుపూ ఉండదు. కార్పొరేట్ అగ్రి బిజినెస్ రాబందులు, బడా వ్యాపారులు ప్రవేశించి, ఎటువంటి అదుపూ లేకుండా వారిష్టం వచ్చినట్టు చెలరేగడానికి అవకాశం కల్పిస్తాయి.
ఈ ఆర్డినెన్సుల వలన రాబోయే ముప్పు ఏమిటో రైతాంగం ముందే అర్ధం చేసుకున్నారు. జూలై నెలలోనే ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ ఆగస్టు 5న 'జైల్ భరో'కు పిలుపునిచ్చింది. దానికి కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. 25 రాష్ట్రాల్లో, 600 జిల్లాల్లో లక్షలాది మంది ఈ పిలుపులో పాల్గొన్నారు. పంజాబ్‌లో రైల్ రోకో కార్యక్రమం అక్టోబరు ఒకటవ తేదీన మొదలైంది. సంయుక్త కిసాన్ మోర్చా నవంబరు 26న ''ఢిల్లీ చలో'' పిలుపునిచ్చింది. అదే రోజున కేంద్ర కార్మిక సంఘాలన్నీ జనరల్ సమ్మెకు పిలుపిచ్చాయి.
ఢిిల్లీ సరిహద్దుల్లో భారీగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఆ దెబ్బకు కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు మొదలుబెట్టింది. మూడు దఫాలు ఈ చర్చలు జరిగాక ప్రభుత్వం ఈ మూడు చట్టాలను కాని, విద్యుత్ చట్టాన్ని కాని ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా లేదని స్పష్టమైంది.
నిరసనలను ఎగదోసి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నది ప్రతిపక్షాలేనంటూ ప్రధానమంత్రి ఆరోపించారు. ఇప్పుడున్న చట్టాలన్నీ గత శతాబ్దపు కాలం చెల్లిన చట్టాలని, అవి ప్రస్తుత శతాబ్దానికి పనికిరావని ఆయన ప్రకటించాడు.
తన కార్పొరేట్-అనుకూల చర్యలను వేటినీ వెనక్కు తీసుకునేది లేదని ప్రభుత్వం తెలియజేసింది. కార్పొరేట్ మీడియా బడా పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలకు అనుగుణంగా వకాల్తా పుచ్చుకుంది. దృఢంగా నిలబడి రైతుల డిమాండ్లను తిరస్కరించమని ప్రభుత్వాన్ని కోరుతోంది. డిసెంబరు 9 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రిక సంపాదకీయం ఈ వైఖరిని ప్రతిబింబిస్తోంది. ''ప్రభుత్వం గనుక కనీస మద్దత్తు ధరమీద కాని, వ్యవసాయ చట్టాల విషయంలో గాని నిరసనకారుల వత్తిడికి లొంగి వెనక్కి తగ్గితే అది ఈ దేశంలో ఏవైనా కొన్ని గ్రూపులు రాజధానిని ముట్టడించి సంస్కరణల ప్రక్రియను దెబ్బ తీయవచ్చునన్న తప్పుడు సంకేతాలనిస్తుంది'' అని ఆ సంపాదకీయం పేర్కొంది.
చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాల ఐక్య వేదికకు పోరాటాన్ని కొనసాగించడం అనివార్యం అయింది. ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన ప్రతిపాదనలను తిరస్కరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలన్న నిర్ణయాన్ని ఐక్యవేదిక తీసుకుంది. రైతులు ప్రదర్శిస్తున్న ఈ అపూర్వమైన ఐక్యతను మరింత బలోపేతం చేయాలి. అప్పుడే ఈ ఉద్యమంలో చీలికలు తేవాలన్న ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టగలం.
అన్ని తరగతుల శ్రామిక ప్రజలూ చురుకుగా కదిలి మద్దతునందించడం ద్వారా ఈ ముఖ్యమైన రైతాంగ పోరాటానికి తోడ్పాటునివ్వాలి. దాని బలం పెంచాలి. అలా మద్దతును అందించడంతో బాటు వ్యవసాయ చట్టాలకు కార్మిక కోడ్‌లకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలను రెండింటినీ ఒకే ఉమ్మడి పోరాటంగా పెంపొందించాలి. ఇది కార్మిక వర్గం ముందున్న ప్రత్యేక కర్తవ్యం.
('పీపుల్స్ డెమాక్రసీ' సంపాదకీయం)










