May 03,2022 07:26
  • మేలుకోకుంటే ముప్పు తప్పదంటున్న నిపుణులు

న్యూఢిల్లీ : దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను దాటి పరుగులు తీస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా అవి మరింతగా పైకి ఎగబాకుతాయన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్దాన్ని సాకుగా తీసుకుని దేశంలో ఇప్పటకే వంట నూనెల ధరలను అనూహ్యంగా పెంచేశారు. ఈ ధరా ఘాతం నుండి ఊరట కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం దానికి భిన్నంగా పెట్రో ఉత్పత్తుల ధరలను రోజురోజుకీ పెంచుకుంటూ పోతుండటంతో సామాన్యుడి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. దీంతో ఆహారసంక్షోభం ముంచుకొస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2007-08లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇదే పరిస్థితి ఏర్పడినప్పటికీ భారత్‌ మాత్రం ఆ దుస్థితి నుండి తప్పించుకుంది. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. సరళీకరణ ఆర్థిక విధానాల్లో భాగంగా ప్రపంచ ఆహార వ్యాపారంలో మన దేశం కూడా భాగస్వామిగా మారింది. ఫలితంగా వివిధ దేశాల్లో ఇప్పటికే నెలకొన్న ఆహార సంక్షోభ ప్రభావం మన దేశం మీద కూడా పడనుందన్న ఆందోళనను పలువురు నిపుణులు వ్యక్తం చేశారంటూ ' ది వైర్‌' ఒక కథనాన్ని ప్రచురించింది.
 

                                                                స్వల్పకాలంలోనే....

దేశ ప్రజలపై స్వల్పకాలంలోనే అధిక ధరల ప్రభావం తీవ్రంగా పడుతుందని అగ్రిాఎకనామిస్ట్‌ ప్రొఫెసర్‌ సుఖ్‌పాల్‌ సింగ్‌ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిటైల్‌ ద్రవ్యోల్భణం 7శాతం, హోల్‌సేల్‌ ద్రవ్యోల్భణం 15శాతం ఉందని, రానున్న రోజుల్లో ఇది మరింత పెరగడం ఖాయమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు రష్యాాఉక్రెయిన్‌ యుద్దంకు చాల ముందునుండే పెరుగుతున్నాయని, మన దేశంలో కూడా అదే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. యుద్దాన్ని అవకాశంగా తీసుకుని మరింతగా పెంచుతున్నారని, సరుకులను బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్నారని తెలిపారు. దీనిని నివారించే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఆ దిశలో స్పందించే అవకాశం చాలా స్వల్పమని అన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలను నియంత్రించినా కొంత మేర ఫలితం ఉంటుందని, ఆ చర్యలను కూడా ఆశించలేమని చెప్పారు. రానున్న రోజుల్లో అనేక దేశాల్లో ఆహార ద్రవ్యోల్భణం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆ దేశాల నుండి మనకు దిగుముతులు నిలిచిపోతాయని తెలిపారు. దీని ప్రభావం మన దేశంలో సరుకుల చక్రంపై పడుతుందని తెలిపారు. వంట నూనెలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.
 

                                                           పాఠం నేర్చుకోవాల్సిందే...

అంతర్జాతీయ పరిణామాల నుండి ఇప్పటికైన పాఠం నేర్చుకుని, ప్రత్యామ్నాయ విధానాలు అనుసరించకపోతే తీవ్ర స్థాయిలో మూల్యం చెల్లించాల్సివస్తుందని వ్యవసాయ విధానాల నిపుణులు దేవిందర్‌ శర్మ అన్నారు. 2007-08 వరకు దేశం వివిధ రంగాల్లో స్వయం సమృద్థిగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 97శాతం ఉత్పత్తి సామర్ధ్యంతో వంట నూనెల రంగంలో దేశం అప్పట్లో స్వయం సమృద్ధిని సాధించిందని, దీనికోసం 'పసుపు విప్లవం'ను ప్రత్యేకంగా నిర్వహించామని చెప్పారు. అయితే, ఆ తరువాత ప్రభుత్వాల విధానాలు మారాయని, అంతర్జాతీయ వాణ్జిజ్యంలో భాగస్వామ్యం పేరిట ఇంపోర్టు డ్యూటీలను రదు చేశామని, దేశంలో నూనె గింజల రైతులను నిరుత్సాహ పరిచామని తెలిపారు. ఇతర ఆహార ఉత్పత్తుల రైతుల పట్ల కూదా ఇదే ధోరణితో వ్యవహరించామన్నారు. విదేశాల నుండి తక్కువ ధరకే తిండిగింజలు వస్తాయని చెబుతూ ఆ పని చేశారని, అయితే కార్పొరేట్‌ కక్కుర్తికి దేశం గురయ్యిందని చెప్పారు. ఇప్పటికైనా ఈ విధానాల నుండి బయటకు రావాల్సిఉందని చెప్పారు. వాతావరణ మార్పులు కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ప్రజలకు ఆహార భద్రతను కల్పించే పౌరసరఫరాల వ్యవస్థను ప్రభుత్వాలు నీరు గారుస్తున్నాయని, రకరకాల సాకులతో రేషన్‌కార్డుల సంఖ్యను తగ్గిస్తున్నాయని వివరించారు.
 

                                                             ప్రభుత్వానిదే బాధ్యత

ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్లే దేశంలో ధరలు పెరుగుతున్నాయని, భవిష్యత్తులోనూ అవే విధానాలు కొనసాగనుండటంతో ఆహారరంగం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోక తప్పదని ప్రముఖ ఆర్థికవేత్త సంతోష్‌ మెహ్రోత్ర అభిప్రాయ పడ్డారు. అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా పెట్రో ఉత్పత్తుల ధరలు నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడక పోవడాన్ని ఆయన ప్రస్తావించారు. పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాల మీదా పడుతోందన్నారు. దీనికి తోడు ఎరువుల కొరత కూడా రానున్న రోజులో ప్రధాన అంశంగామారనుందని, దాని ప్రభావం కూడా ఆహార రంగంపై పడుతుందని చెప్పారు. దేశీయంగా ఉత్పత్తయ్యే వ్యవసాయ పంటలకు సరైన మార్కెట్‌ వ్యవస్థ లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతుందని, అదే సమయంలో రైతులకు కనీస ధర దొరుకుతుందన్న గ్యారంటీ ఏమీ లేదని చెప్పారు. ఫలితంగా వ్యవసాయరంగంలో సంక్షోభం కొనసాగుతుందని, నిరుద్యోగం పెరుగుతుండటం, ఉపాధి అవకాశాలు కుదించుకుపోవడం వంటి చర్యల కారణంగా ప్రజల కొనుగోలు శక్తి మరింత తగ్గే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 

                                                            తక్షణం ఏం చేయాలి...

కార్పొరేట్లకు పెద్ద ఎత్తున రాయితీలిచ్చిన కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలోనే సామాన్యుల నుండి 26 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిందని, ఈ తరహా విధానాలు మార్చుకోవాలన్న అభిప్రాయాన్ని పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కోటి రూపాయల వార్షిక ఆదాయం ఉండే వారిపై సంపద పన్నును విధించాలని, ఇది కాక కార్పొరేట్‌ల నుండి కోవిడ్‌ సర్‌ఛార్జిల పేరిట మరింత వసూళ్లు చేయాలని వారు చెబుతున్నారు.