ముఖ్యమంత్రివి మోసపూరిత వాగ్దానాలు
ప్రజాశక్తి-కావలి : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డివి మోసపూరిత వాగ్ధానాలు అని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో ఆయన శనివారం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ రాష్ట్రాన్ని పాలించిన ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశామనీ, ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు. తాను అమలు పరుస్తున్న జిఒలను కోర్టు వారు తిరస్కరిస్తుంటేనే ముఖ్యమంత్రి ఆలోచన విధానం అర్థమవుతుందని తెలిపారు. ప్రజలు జగన్ పరిపాలన పోయి చంద్రబాబునాయుడు పరిపాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావలికి వచ్చి రూ.150 కోట్లు కావలి అభివృద్ధికి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత నాలుగు సంవత్సరాల కాలంలో తుమ్మలపెంట రోడ్డు, బట్లదిన్నె రోడ్డు, తాళ్లపాలెం రోడ్డు పనులు చేయలేకపోయి, ఈరోజు మోసపూరిత వాగ్దానాలు ప్రజలకు ఇవ్వవద్దని హితవు పలికారు. ముఖ్యమంత్రి వచ్చిన రోజు గ్రావెల్ అవినీతి గురించి పత్రికల్లో వచ్చింది చూడలేదా.. అని ప్రశ్నించారు. కావలిలో గ్రావెల్ మాఫియా ఎవరంటే చిన్నపిల్లాడిని అడిగిన ఎంఎల్‌ఎ పేరు చెబుతారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందే టిడిపి అని... ఆ విషయాన్ని గుర్తుంచుకొని వైసిపి నాయకులు మాట్లాడాలని తెలియజేశారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి మొగిలి కల్లయ్య, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులు బొట్లగుంట శ్రీహరి నాయుడు, మైనారిటీ రాష్ట్ర విభాగం కార్యనిర్వాక కార్యదర్శి షేక్ మస్తాన్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు కోట రమేష్, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ రహీం, 31వ వార్డు ఇన్‌ఛార్జి మంచాల ప్రసాద్, కోవూరు వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.










