Feb 22,2023 20:44

- మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ గుర్తింపు ఆధారిత హాజరు వంద శాతం అమలయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం తాడేపల్లి నుండి కార్యదర్శి ముత్యాలరాజు సిఎఫ్‌ ఎంఎస్‌ అధికారి సునీల్‌రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ గుర్తింపు ఆధారిత హాజరు అమలుపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ గిరీష, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా, డిఆర్‌ఒ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గిరీష మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి ముఖ గుర్తింపు ఆధారిత హాజరు తప్పనిసరి చేసిందని ఉద్యోగులందరూ ఎపిఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకొని తప్పకుండా ముఖ ఆధారిత హాజరు వేయాలన్నారు. ఇంకా ఎవరైనా ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకోని వారు ఉంటే వెంటనే యాప్‌ డౌన్లోడ్‌ చేసుకోవాలన్నారు. ప్రతి ఉద్యోగి ఉదయం సాయంత్రం తప్పకుండా ముఖ గుర్తింపు ఆధారిత హాజరు వేయాలన్నారు. క్యాంపు వెళ్ళిన అధికారులు, ఆన్‌ డ్యూటీలో ఇతర ప్రాంతంలో ఉన్న అధికారులు యాప్‌లో ఉన్న నిబంధనల మేరకు హాజరు వేయాలన్నారు. ఇందులో ఎటువంటి సాంకేతిక సమస్యలు, సందేహాలు ఉన్నా వెంటనే ఎన్‌ఐసి వారిని సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా సిబ్బంది ముఖ గుర్తింపు ఆధారిత హాజరును సంబంధిత డిడిఒలు పర్యవేక్షించాలన్నారు.