Feb 04,2023 20:01

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

పజాశక్తి-రాయచోటి: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరు వేయాలని కలెక్టర్‌ గిరీష్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో వైద్య శాఖ అధికారులతో ముఖ ఆదారిత హాజరు, హైరిస్క్‌ ప్రెగెన్సీ బర్త్‌ ప్లానింగ్‌, 10-19 ఏళ్ల బాలబాలికలకు వైద్య పరీక్షలు, అనీమియా, ఫ్యామిలీ ఫిజీషియన్‌ అమలు, తదితర పలు అంశాలపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే బాధితులకు బాధ్యతగా వైద్య సేవలు అందించి, రోగులకు భరోసా కల్పించాలన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది విధిగా సమయానికి విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఎన్‌సిడిసిడి సర్వే హెల్త్‌ కార్డు ఐడి క్రియేట్‌ పక్కాగా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎఎన్‌ఎంలు క్రమం తప్పకుండా బిపి, మధుమేహం, హిమోగ్లోబిన్‌ను పరీక్షించుట (చిన్నపిల్లలకు), తదితర పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలన్నారు. హైరిస్క్‌ గర్భిణులపై ప్రత్యేక దృష్టి పెట్టి పక్కా ప్రణాళికతో డెలివరీ డేట్‌కు ముందే ఆసుపత్రికి తరిలించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు. హైరిస్క్‌ ప్రెగెన్సీలను గుర్తించడంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. హైరిస్క్‌ కాకుండా మెటర్నల్‌ డెత్‌ జరిగితే ఎఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్‌పై చర్యలు తప్పవన్నారు. హైరిస్క్‌ ప్రెగెన్సీ పేషెంట్‌ల ట్రాన్స్పోర్ట్‌ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో 192 మంది హై రిస్క్‌ ప్రెగెన్సీలు ఉన్నారని, నాలుగు వారాలు ముందుగానే బర్త్‌ ప్లానింగ్‌ చేయించాలన్నారు. నెలాఖరికి అనీమియా టెస్టింగ్‌ 100 శాతం జరగాలన్నారు. హిమోగ్లోబిన్‌ టెస్ట్‌ జాగ్రత్తగా చేయాలని, రాంగ్‌ డేటా నమోదు చేస్తే మాత్రం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, గురుకులాల్లో వైద్య అధికారులు విజిట్‌ చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలన్నారు. ప్రధానంగా వసతి గ హాల్లో విద్యాభ్యాసం చేసే 10 నుంచి 19 ఏళ్ల బాలికలకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేయాలన్నారు. సిడిపిఒ, సూపర్వైజర్లు, మెడికల్‌ ఆఫీసర్‌, ఎంఈఓలు తమ పరిధిలో ఉన్న హాస్టల్స్‌ను విజిట్‌ చేయాలన్నారు. జిల్లాలో ఫ్యామిలీ ఫిజీషియన్‌ పక్కాగా అమలు కావడంతోపాటు ఒపి సంఖ్య మరింత పెంచాలన్నారు. 104, 108 అంబులెన్స్‌ రెస్పాన్స్‌ టైం తగ్గేలా మెడికల్‌ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు. 104, 108 అంబులెన్స్‌ సేవలపై పర్యవేక్షించాలని మెడికల్‌ ఆఫీసర్లను కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో వైద్య సిబ్బంది ముఖ ఆధారిత హాజరు 90 శాతం వేశారన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ముఖా ఆధారిత హాజరును పెంచాలన్నారు. సమీక్షలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కొండయ్య, డిప్యూటీ డిఎంహెచ్‌ఒలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.