ముగిసిన శ్రీకల్యాణ వెంకన్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు
ప్రజాశక్తి - క్యాంపస్ : తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్స వాల్లో చివరి రోజు సోమవారం ఉదయం 7 గంటల నుంచి చక్రస్నానం ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కంకణభట్టార్ గిరిధర్ భట్టాచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్రస్నానం, ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు. ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధం లోని అభిషేక సమయంలో దేవదేవునికి అనుసంధానం చేసే వేదాలను పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. సోమవారం సాయంత్రం 5.30 నుండి 7 గంటల మధ్యన జరిగిన ధ్వజావరోహణంతో బ్రహ్మోత్స వాలు ముగిసాయి. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షు లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.










